calender_icon.png 22 February, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్‌లైన్ వద్దంటున్న ప్రైవేటు డిగ్రీ కాలేజీలు దోస్త్ కటీఫ్?

19-02-2025 01:41:29 AM

  1. ఇంటర్ ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకుంటామంటున్న అధికారులు
  2. దోస్త్ ఎత్తివేస్తే ప్రైవేట్ కాలేజీల ఇష్టారాజ్యం
  3. సీట్ల కొరత సృష్టించి ఫీజులు దండుకునే చాన్స్

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) విధానాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు కొన్ని ప్రైవేట్ కాలేజీలు తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆ దిశగా నిర్ణయం తీసుకునే ఆలోచనలో తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో బీఎస్సీ, బీకామ్, బీఏ వంటి డిగ్రీ కోర్సులకు 2016- 17నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనే అడ్మిషన్లు చేపడుతోంది. కాలేజీలకు వెళ్లకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసు కోవడం జరుగుతోంది. 2024-25 విద్యాసంవత్సరం కూడా ఇదే విధానంలో ప్రవే శాలు కల్పించారు.

ఈ ఏడాది సైతం 2025 -26 విద్యాసంవత్సరానికి డిగ్రీలో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులతో జరిగిన సమావేశంలో దోస్త్‌ను ఎత్తివేయాలని కొన్ని ప్రైవేట్ కాలేజీ ల యాజమాన్యాలు డిమాండ్ చేసినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రైవేట్ కాలేజీలు దీన్ని తీసేయ్యాలంటే, ప్రభుత్వ కాలేజీలు కొనసాగించాలని కోరినట్లు తెలిసింది.

దోస్త్‌లో చేరని 50 కాలేజీలు

దోస్త్ పరిధిలో మొత్తం డిగ్రీ కళాశాలలు (రెసిడెన్షియల్ మినహా) 886 ఉన్నాయి. వీటిలో మొత్తం 546 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 2024-25 విద్యాసంవత్సరంలో వీటిలో 3,84,748 సీట్లు ఉన్నాయి. అయితే డిగ్రీలో విద్యార్థుల సంఖ్య కంటే సీట్లు ఎక్కువగా ఉంటున్నాయని ఉన్నత విద్యామండలి అధికారుల వాదన.

2024-25లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో పాసైన విద్యార్థులు 2,83,530 మంది ఉంటే, సీట్లు మాత్రం వారికంటే ఎక్కువగా ఉంటున్నాయంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కాలేజీలను లెక్కలోకి తీసుకుంటే నాలుగు లక్షలపైనే సీట్లున్నాయి. దోస్త్‌ను కొన్నేళ్లుగా దాదాపు 50 నుంచి 70 కాలేజీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దోస్త్ జాబితాలో అవి చేరలేదు. 

2016లోనే కోర్టుకు..

దోస్త్ ద్వారా ప్రవేశాలను నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని కాలేజీలు 2016-17లోనే హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నోటిఫికేషన్‌పై 50కిపైగా కాలేజీలు హైకోర్టును ప్రతిసారి ఆశ్రయిస్తూ ప్రవేశాలను జరుపుతూనే ఉన్నాయి. ఈమధ్య మరికొన్ని కాలేజీలు ఈ దోస్త్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దోస్త్ విధానాన్ని ఎత్తివేస్తే ఆయా కాలేజీలపై నియంత్రణ ఉండదు.

సీటు ఎవరికివ్వాలి? ఎవరికి ఇవ్వకూడదనేది? కాలేజీలే నిర్ణయిస్తాయి. అవసరమైతే సీట్ల కృత్రిమ కొరతను సృష్టిస్తాయి. తద్వారా సీట్లకు డిమాండ్ పెరిగి అడిగినంత ఫీజులు వసూలు చేసే వీలుంటుంది. ఇది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సీటు కోసం ప్రతీ కాలేజీ చుట్టూ తిరగాల్సి ఉంటుంది.

అదే దోస్త్ ద్వారా ప్రవేశాలు చేపడితే ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థికి కాలేజీల్లో సీటు లభిస్తుంది. తనకు ఇష్టమైన కాలేజీను, కోర్సును దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ, అధికారులు ప్రైవేట్ కాలేజీలకే వంతపాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మిగులుతున్న సీట్లు..

ఇంటర్‌లో మెరిట్ ఉండటం వల్ల విద్యార్థికి స్థానికంగా కాకుండా ఎక్కడో దూరప్రాంతాల్లో సీట్లు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి. సీట్లు కూడా ఎక్కువగా మిగిలిపోతున్నాయని, ఆయా కాలేజీల్లో విద్యార్థులు చేరడంలేదని అధికారులు వాదన.

అందుకే ఇంటర్‌లో పాసయ్యే విద్యార్థులకు డిగ్రీలో చేరుతున్న విద్యార్థులకు పొంతన ఉండటం లేదంటున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత డిగ్రీ కాలేజీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి దోస్త్ ఉంచాలా? ఎత్తివేయాలా? అనేదానిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.