calender_icon.png 6 November, 2024 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్గానిక్ ఉత్పత్తులు ఆరోగ్యకరమేనా?

04-11-2024 01:06:36 AM

  1. మార్కెట్‌లో దొరికేవన్నీ సేంద్రియ పదార్థాలేనా?
  2. ఆర్గానిక్ పదార్థాలకు, సహజ పదార్థాలకు మధ్య తేడా ఏంటి?
  3. ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారు?

న్యూడిల్లీ, నవంబర్ 3: ప్రజల ఆలోచనాశైలి కొంతకాలంగా మారుతూ వస్తోంది. ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెడుతూ ఆర్గానిక్ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఏదైనా ఆహార పదార్థంపై ఆర్గానిక్ అని కనిపిస్తే చాలు దాన్ని కొనేసి ఇంటికి తీసుకెళ్లిపోతున్నారు.

మరైతే అలా ఆర్గానిక్ ట్యాగ్ కనిపించినవన్నీ నిజంగా సేంద్రీయ పదార్థాలేనా? వాటిని ఆహారంగా తీసుకోవడం సురక్షితమేనా? అంటే కచ్చితంగా ఆ పదార్థాలన్నీ నూటికి నూరుశాతం సేంద్రియ పదార్థాలు అని చెప్పగలమా? అలాగే వాటిని తినడం శ్రేయస్కరం అని భావించగలమా? ఎందుకంటే సహజ ఆహా రం, సేంద్రియ ఆహారం చూడటానికి ఒకేలా అనిపిస్తున్నా రెండింటి మధ్యా చాలా వ్యత్యా సం ఉంది.

సహజ ఆహారాలన్నీ సేంద్రియ ఆహారాలు కావు. అలాగే సేంద్రియ ఆహారాలు పదార్థాలు అన్నీ సహజ ఆహార పదార్థాలు కావు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

పోషకాల మాటేమిటి?

సేంద్రియ ఆహార పదార్థాల ఉత్పత్తిలో రైతులు రసాయన ఎరువులు, పురుగు మందులను వాడరు. అలాగే జన్యుపరంగా అభివృద్ది చేసిన విత్తనాలను సేంద్రీయ వ్యవసాయంలో ఉపయోగించరు. జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించే విధంగా జంతు సంరక్షణ పద్ధతులను అమలు పరుస్తూ పర్యావరణ హితంగా సేంద్రియ వ్యవసాయంలో ఆహార పదార్థాలను పండిస్తారు.

అయితే ఆర్గానిక్ ఫుడ్ పేరుతో మార్కెట్ లభించే ఆహార పదార్థాలను ఈ పద్ధతుల్లోనే పండిస్తారని కచ్చితంగా చెప్పలేమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా జన్యుపరంగా అభివృద్ధి చేసిన విత్తనాలు, సింథటిక్ పురుగు మందులు వాడకుండా పండించారని నిర్ధారించలేమట. అయితే, ఈ ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగులు, రుచులు, సంరక్షాలు మాత్రం ఉండవచని చెప్పొచ్చట.

అలాగే ఆర్గానిక్ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అన్ని పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మనం తీసుకున్నట్టు కాదనే విషయాన్ని గ్రహించాలి అంటున్నారు. భూమి నాణ్యత, విత్తనాల రకం, పండించేకాలం, వ్యవసాయ పద్ధతులు వంటివి సేంద్రియ ఆహార పదార్థాల్లో లభించే పోషకాల పరిమాణాన్ని నిర్ణయిస్తాయట. 

ఆర్గానిక్‌తోనే ఆరోగ్యంగా ఉంటామా?

సేంద్రియ ఆహార పదార్థాల్లో రసాయన పురుగులు, ఎరువులు వాడకపోవడం వల్ల కాస్త అధికంగానే పోషక ప్రయోజనాలు పొందుతామనేది వాస్తవమే. కానీ పెద్ద ఎత్తున పంటలకు రసాయన పదార్థాలు అందించకుండా తగిన మోతాదులోనే వాడటం వల్ల మనకు సహజంగా మార్కెట్‌లో దొరికే ఆహార పదార్థాల్లోనూ మనకు కావాల్సినంత పోషక విలువలు ఉంటాయి.

సేంద్రియ ఆహార పదార్థాలు ఎక్కువ మొత్తంలో పండించకపోవడం వల్ల మార్కెట్‌లో విరివిగా లభించే అవకాశం లేదు. ఒకవేళ దొరికినా వాటి ధరలు ఆకాశాన్నంటుతాయి. మధ్య తరగతి ప్రజలకు వాటిని కొనుగోలు చేసేంత శక్తి ఉండదు. అలాంటప్పుడు సహజంగా మార్కెట్‌లో లభించే ఆహార పదార్థాలను తగినంతగా తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు పొందొచ్చు.

ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డైయాబెటీస్ పేషెంట్లు ఆర్గానిక్ ఆహార పదార్థాలను తినడానికి ఆసక్తి చూపుతున్నారు. బడ్జెట్ తగినంతగా లేనప్పుడు మార్కెట్‌లో లభించే పదార్థాలను తగినంతగా తీసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్‌లో ఆర్గానిక్ లేబుల్‌తో దొరికే ఆహార పదార్థాలను కొనే ముందు నిజంగా అవి సేంద్రీయ పద్దతిలో పండించారా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించుకోవాలి. అవసరమైతే ల్యాబ్ సర్టిఫికెట్లను పరిశీలించాలని నిపుణులు పేర్కొంటున్నారు.