calender_icon.png 8 February, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లింలు బీసీలా?

08-02-2025 12:34:11 AM

కులగణనతో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం

  1. హిందూ, ముస్లిం బీసీ అని ఏ చట్టంలో ఉంది
  2. కులమతాల పేరుతో ప్రజలను విడగొట్టడం రాహుల్‌కు అలవాటే
  3. 50శాతానికిపైగా ఇళ్లలో సర్వే జరగలేదు
  4. మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశం లో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం బీసీ, హిందూ బీసీలు అని కొత్త పాలసీ తీసుకొచ్చిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదికపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

ఏ చట్టంలో ముస్లిం బీసీ అనే పదం రాసి ఉందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ముస్లింలను బీసీల్లో కలపడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొ న్నారు. ప్రజలను కాంగ్రెస్ మతం పేరు తో రెచ్చగొడుతోందని ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో ప్రజలను విడగొట్టడం రాహుల్‌కి అలవాటేనని విమర్శించారు.

ఆదరబాదరగా కులగణన చేసి బీసీ జనాభా తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం విచారకరమని కేంద్రమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 50శాతానికి పైగా ఇళ్లలో అసలు సర్వేనే చేయలేదని ఆరోపించారు. ఒక పక్క తమకు న్యాయం కావాలని బీసీలు కోరుతుంటే, మరోపక్క వారికి అన్యాయం చేసే విధంగా ముస్లింలను బీసీల్లో కలపడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేను బీసీ సంఘాలు వ్యతిరేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. 

ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానం

అంతకుముందు దేశంలో బొగ్గు ఉత్పత్తి విషయంపై కేంద్ర మంత్రి కిషన్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. బొగ్గు నిల్వల్లో ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నట్లు స్పష్టం చేశారు. గ్లోబల్  స్థాయిలో రెండో అతిపెద్ద బొగ్గు వినియోగదారుగా భారత్ ఉందని చెప్పారు.

కోలిండియా ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అని పేర్కొన్నారు. పవర్, స్టీల్, సిమెంట్, అల్యూమినియం, ఫెర్టిలైజర్, హెవీ ఇండస్ట్రీస్ రంగాల్లో బొగ్గు కీలక ఖనిజమని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో బొగ్గు ద్వారానే 74శాతం విద్యుదుత్పత్తి జరుగుతోందన్నారు. రానున్న దశాబ్దాల్లోనూ బొగ్గు ఒక కీలకమైన ఇంధనంగా పని చేస్తుందన్నారు.