calender_icon.png 5 April, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఫోన్ల ధరలకు రెక్కలు?

05-04-2025 12:45:20 AM

  1. 30-40 శాతం మేర పెరిగే అవకాశం?
  2. చైనాను వీడనున్న అమెరికా కంపెనీలు!
  3. ధరల పెంపును వినియోగదారులు ఒప్పుకుంటారా? 

వాషింగ్టన్, ఏప్రిల్ 4: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల ప్రభావంతో యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ల ధరలు 30-40 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నట్టు  తెలుస్తోంది. ఐఫోన్లను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇష్టపడుతుంటారు. కానీ ప్రస్తుతం వీటి రేట్లు పెరుగుతాయని అంటున్నారు. దీంతో కస్టమర్లు ప్రత్యామ్నాయాల వైపు వెళ్లే ప్రమాదం ఉందని, తద్వారా యాపిల్ కంపెనీకి నష్టాలు తప్పవని అంచనా వేస్తున్నారు.

యాపిల్ అమెరికన్ కంపెనీ అయిన ఆ కంపెనీకి చెందిన ఐఫోన్లు ఎక్కువగా చైనాలో తయారవుతాయి. ప్రస్తుతం చైనాపై 34 శాతం ప్రతీకార సుంకాలను విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో యాపిల్ ఫోన్ల ధరలకు రెక్కలొస్తాయని అంతా భావిస్తున్నారు. చాలా వరకు అమెరికన్ కంపెనీలు చైనాలో వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి.

ప్రస్తుత పరిణామాలతో అమెరికన్ కంపెనీలు చైనాను వీడే అవకాశం ఉంది. ఐఫోన్ల ధరలు 30 శాతం మేర పెరిగితే.. యూజర్లు దక్షిణకొరియాకు చెందిన శామ్‌సంగ్ వైపు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. ఈ అదనపు భారాన్ని యాపిల్ వినియోగదారులపై వేస్తుందా? లేదా? అనే విషయంలో ఎటువంటి స్పష్టత లేదు.

ప్రస్తుతం ఐఫోన్ 16 (128 జీబీ) ధర 799 అమెరికన్ డాలర్లు (రూ. 68 వేలకు పైచిలుకు) ఉంది. ఈ సుంకాల ప్రభావంతో దాని ధర 1142 అమెరికన్ డాలర్ల్ల (రూ. 97 వేల పైచిలుకు) కు పెరిగే అవకాశం ఉంది. ఇక ఐఫోన్‌లో ప్రీమియం మోడల్ అయిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధరలు కూడా పెరిగి 2 లక్షల మార్కును చేరుకుంటాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  ఏఐ సాంకేతికత విషయంలో యాపిల్ కంపెనీ అమ్మకాలు ఇప్పటికే తగ్గుముఖం పట్టినట్టు పలు నివేదికలు చెబుతుండగా.. ట్రంప్ సుంకాలు మరి యాపిల్ కంపెనీని ఎటు వైపు తీసుకెళ్తాయో చూడాలి.