calender_icon.png 16 January, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజిస్ట్రేషన్ చార్జీలకు కోర్టు ఖర్చులు అదనమా?

06-07-2024 01:37:53 AM

పెద్ద అంబర్‌పేట సబ్ రిజిస్ట్రార్ నిలదీసిన హైకోర్టు

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): స్థలాల రిజిస్ట్రేషన్ల వ్యవహారాల్లో సమస్యలకు రెవెన్యూ వ్యవస్థలోనే లోపమే కారణమని హైకోర్టు అభిప్రాయపడింది. ఏళ్ల తరబడి చెమచోడ్జిన డబ్బుతో వందో రెండు వందల గజాల జాగాను కొనుక్కొన్నవారు రిజిస్ట్రేషన్ చేయించుకొనేందుకు వెళితే రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ, జీఎస్టీలతోపాటు కోర్టు ఖర్చులు, ఇతర ఫీజుల భారం పడుతోందని అసహనం వ్యక్తంచేసింది. వీటిని సబ్ రిజిస్ట్రార్లు పట్టించుకోకుండా కోర్టు నుంచి ఉత్తర్వులు తేవాలని వినియోగారులను కోరడం దారుణమని వ్యాఖ్యానించింది. కోర్టు వివాదం ముగిసిన తర్వాత కూడా తాజా కోర్టు ఉత్తర్వుల ప్రతి తేవాలని పట్టుబట్టడంతో సామాన్య ప్రజలకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

కోర్టు వివాదం ముగిసిన తర్వాత కూడా ఉత్తర్వుల ప్రతి ఇవ్వాలని కోరడానికి అంబర్‌పేట సబ్ రిజిస్ట్రార్ చెప్పిన కారణాలపై కోర్టు సంతృప్తిని వ్యక్తం చేసింది. ఎలాంటి నిషేధ ఉత్తర్వులు లేకపోయినా పెద్ద అంబర్‌పేటలో సర్వే నం.256లోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన అనంత రామేశ్వరిదేవి వేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్ కుమార్ విచారించారు. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరైన పెద్ద అంబర్‌పేట సబ్ రిజిస్ట్రార్‌ను న్యాయమూర్తి నిలదీశారు. 2024 మేలో వారసత్వ వివాదానికి సంబంధించి ఆర్డీవో, ఇబ్రహీంపట్నం ఇనాం ట్రైబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఎందుకు నిరాకరించారని ప్రశ్నించారు. పిటిషనర్ న్యాయవాది మద్ది రాజేష్ వాదిస్తూ, తాజా కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ నిరాకరించారని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో లిఖితపూర్వక కౌంటర్ వేయాలని ఆదేశించిన ధర్మాసనం.. విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది.