02-03-2025 12:00:00 AM
పెళ్లయిన వెంటనే బిడ్డను కనాలని పెద్దలు చెబుతూ ఉంటారు. త్వరగా పిల్లలు పుట్టడం వల్ల భార్యాభర్తల మధ్య బంధం మరింతగా పెరుగుతుందని, విడిపోకుండా కలిసి ఉంటారని చెబుతూ ఉంటారు. అందుకే పెళ్లున వెంటనే కుటుంబ పెద్దలు భార్యాభర్తలపై బిడ్డను కనాలని ఒత్తిడి చేస్తుంటారు.
కాని ఒక అధ్యయనం ప్రకారం.. బిడ్డ పుట్టిన తర్వాతే భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. బిడ్డ పుట్టాక విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉందని అధ్యయనం తేల్చి చెప్పింది.
పిల్లలు పుట్టిన తర్వాత కంటే పిల్లలు పుట్టకముందే భార్యాభర్తలు ఆనందంగా ఉన్నట్టు అధ్య యనం చెబుతున్నది. పిల్లలు లేని జంటలే తమ సంబంధంలో ఎక్కువ సంతృప్తిగా జీవిస్తున్నట్టు పరిశోధనలో వెల్లడైంది.
తల్లులు కాలేకపోయినా మహిళలు సంతోషంగానే ఉన్నామని కూడా చెప్పినట్టు అధ్యయనంలో వెల్లడైంది. భర్తతో అనుబంధం ఎక్కువగానే ఉందని వారితో ఎక్కువ సమయం గడుపుతున్నట్టు మహిళలు వివరించినట్టు అధ్యయనం చెబుతున్నది.
అధ్యయనం ఏం చెబుతున్నది?
పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య బంధం పదేళ్లలోపే క్షీణిస్తోందని, అవి విడాకులకు దారితీస్తోందని కూడా అధ్యయనం వివరిస్తోంది. దీనికి కారణం పిల్లల పుట్టాక బాధ్యతలు పెరగడం, భార్యాభర్తల మధ్య ఎక్కువ సమయం గడపలేకపోవడం, ఆర్థిక సమస్యలు, ఇంటి పనులు పెరగడం వంటివి ఉన్నాయి.
ఎదురయ్యే సమస్యలు..
పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలిద్దరికీ నిద్ర తగ్గిపోతుంది. పసిపిల్లలకు ఎక్కువ సేపు పనులు చేయాల్సి వస్తుంది. దీనివల్ల రాత్రి మేలుకొని ఉండాల్సిన వస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలు ఈ పరిస్థితుల వల్ల విపరీతంగా అలసిపోతున్నా రు. చిన్న విషయాలకే కోపతాపాలకు గురవుతున్నారు. గొడవలు పడుతున్నారు. విడిపోయేదాకా పరిస్థితులను తెచ్చుకుంటున్నారు.
ఒకరిపై ఒకరు నిందలు..
పిల్లలు పుట్టకముందు భార్యాభర్తలు ఇద్దరే ఉండేవారు. వారిద్దరూ కూడా తమ పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాక ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడిపేవారు. దీనివల్ల వారి బంధం పటిష్టంగా ఉండేది. కానీ పిల్లలు కలిగాక ఆ పిల్లాడి బాధ్యతల విషయంలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, సమయం కుదరక ఇద్దరి మధ్య దూరం పెరుగుతున్నది. కాలక్షేపం కోసం, ప్రశాంతత కోసం బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు.
బాధ్యత అవసరం..
పిల్లలు పుట్టాక వారి బాధ్యతలను చూసుకునేందుకు కూడా వంతులు చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. ఈ కాలంలో తల్లులు కూడా ఉద్యోగం చేయడం వల్ల పిల్లలను ఎవరు చూసుకోవాలన్న దానిపై ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. పిల్లల బాధ్యత నుంచి తప్పించుకోవడానికి కూడా కొంతమంది తండ్రులు భార్యను వదిలిపెట్టి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇదే పరిష్కారం..
పిల్లలు కలిగాక కూడా భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్లకుండా ఉండాలంటే ముందుగానే మాట్లాడుకోవాలి. పిల్లలు ఒక వయసు వచ్చేవరకు ఇష్టాయిష్టాలను పక్కన పెట్టుకోవాలని ఒక ఒప్పందానికి రావాలి. పిల్లలతో ఎంజాయ్ చేయడం ఎలాగో తెలుసుకుంటే జంటలు ఎక్కువకాలం పాటు కలిసి ఉంటారు. కాబట్టి పిల్లలను అడ్డుగా లేదా బరువుగా భావించకుండా వారే జీవితంగా భావిస్తే కుటుంబం నిలబడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.