calender_icon.png 30 November, 2024 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఎంపీలకు బుద్ధి లేదా?

30-11-2024 02:15:50 AM

  1. తెలంగాణకు ఇచ్చే నిధులపై కేంద్రాన్ని నిలదీయాలి
  2. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

భీమదేవరపల్లి, నవంబర్ 29: వరదలతో తెలంగాణకు రూ.10 వేల కోట్లు నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.400 కోట్లు ఇవ్వడం బాధాకరమని రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రాన్ని నిలదీయాలన్న బుద్ధి, జ్ఞానం తెలంగాణ బీజేపీ ఎంపీలకు లేదా అని విరుచుకుపడ్డారు.

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో శుక్రవారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. వీరభద్రస్వామి పురాతన ఆలయానికి వెళ్లేందుకు మెట్ల మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్తకొండలో పల్లె దవాఖానను ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ ఎంపీలు క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. ప్రజల బలిదానాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్రం ఇచ్చిందన్నారు.  తెలంగాణ ఏర్పాటుపై తెలంగాణ బీజేపీ నాయకత్వం మరోసారి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో కులగణన దాదాపు 4 శాతం మాత్రమే మిగిలి ఉందని మంత్రి చెప్పారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కులగణన చేయించుకోవాలని, ఇందుకు స్పెషల్ డ్రైవ్  ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 

గురుకులాలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం

గురుకుల పాఠశాలల్లో వసతులు అన్ని సమకూరుస్తున్నామని మంత్రి పొన్నం చెప్పారు. గురుకులాల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఫుడ్‌సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. గురుకులాలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. 

నూతన మండలంగా కొత్తకొండ

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వీరభద్రుడు కొలువైన కొత్తకొండను మం డలంగా ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. జనవరి రెండవ వారంలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు నూతన పాలకమండలి త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రి  వెంట కొ మురవెళ్లి చంద్రశేఖర్‌గుప్తా, ఊసకోయిల ప్రకాశ్, పిడిశెట్టి కనుకయ్య, కేతిరి లక్ష్మారెడ్డి, ఆదరి రవిందర్, కొ లుగూరిరాజు,  చిదురాల స్వరూప, బొక్కల స్రవంతి, గాదపాక శారద, స్వర్ణలత, కళావతి ఉన్నారు.