దేశంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ అత్యధిక శాతం జనాభా గల బలహీన వర్గాల ఓట్లు రాజకీయ పార్టీలను గెలిపించటంలోనూ, అధికారంలోకి తీసుకురావ టంలోనూ కీలకంగా మారాయి. బలహీన వర్గాల ఓట్లతోనే తెలంగాణ, కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్, హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ గెలిచాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్,బీజేపీ, బీఆర్‌ఎస్ మూడు రాజకీయ పార్టీలు బీసీల ఓట్లసాధనే లక్ష్యంగా అనేక హామీలను ఇవ్వడం జరిగింది.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తే, బీజేపీ తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే హామీతో ఎన్నికలను ఎదుర్కొన్నాయి. భవిష్యత్‌లో రాజకీయంగా బలపడటానికి, బీసీల ఓట్లను సంఘటిత పరుచుకోవటానికి రాష్ట్రంలో రాజకీయ పార్టీలు బీసీలపై ప్రేమ వలక బోస్తూ వారి సమస్యలపై పోరాడుతామని, వారికి అవకాశాలు కల్పిస్తామని నమ్మబలుకుతున్నాయి.
సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ దశాబ్దపు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా బీసీల సంక్షేమం, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేయలేదు. వారికి అవకాశాలు కల్పించటానికి ముందుకు రాలేద నేది జగమెరిగిన సత్యం. ఎన్నికలకు ముం దు బీసీలకు హామీలు ఇవ్వటం, తరువాత పట్టించుకోని రాజకీయాలను దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం.
బీసీల పట్ల పార్టీలు అధికారంలో ఉంటే ఒకరకంగా, లేకపోతే మరొక రకంగా వ్యవహరిస్తూ తమ అవసరాలకు వాడుకుంటున్న రాజకీయాలే దశాబ్దాలుగా కనిపిస్తున్నాయి. కాకా కలేల్కర్ కమిషన్ నుండి మండల్ కమిషన్, జస్టిస్ రోహిణి కమిషన్ వరకు బీసీల అభివృద్ధి కోసం చేసిన సిఫారసులను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదనేది వాస్తవం.
దశాబ్దపు అన్యాయం
ప్రత్యేక తెలంగాణలో అధికారంలో, ఆర్థికంలో, సంక్షేమంలో బీసీలకు గతంలో కంటే ఎక్కువ న్యాయం జరుగుతుందని ఆశించారు. కానీ దశాబ్ద పాలనా కాలంలో బలహీనవర్గాల పరిస్థితి ‘పెనంపైనుండి పొయ్యిలో పడిన’ చందంగానే మారింది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో స్థానిక సంస్థలలో బిసీలు రిజర్వేషన్లు కోల్పోయారు (34 శాతం నుండి 23 శాతానికి తగ్గించారు). బీసీ సబ్ ప్లాన్ డిమాండ్‌ను అటకెక్కించారు. 50 శాతం ఉన్న జనాభాకు బడ్జెట్‌లో 3 శాతం కంటే తక్కువ నిధులు కేటాయించారు.
బీసీ,ఎంబీసీ కార్పొరేషన్లకు, ఫెడరేషన్లకు నిధులు తగ్గించారు. బీసీ విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్‌మెంట్‌పై ఆంక్షలు పెట్టి అన్యాయం చేశారు. రాజకీయంగా పదవులలో, అధికారంలో బీసీలకు సరైన అవకా శం కల్పించపోవటం వలన వారు అన్యాయానికి గురైనారు.
అడగని ఆత్మగౌరవ భవనాలు, చిత్తశుద్ధి లేని గొర్రెలు, చేప పిల్లల పంపిణీ, ఫూలే విదేశీ విద్యాజ్యోతి లాంటి మొక్కుబడి పథకాలు, ఎన్నికలకు ముందు బీసీ బంధులాంటి పథకాలను తీసుకువచ్చి వారిని ఏమార్చే ప్రయత్నాలు చేశారు తప్ప చిత్తశుద్ధితో బీసీల అభ్యున్నతికి చర్యలు చేపట్టలేదు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోని పార్టీ అధికారం పోయిన తరువాత బీసీల జపం చేయటం పోయిన అధికారాన్ని మళ్లీ రాబట్టుకునే రాజకీయ వ్యూహం తప్ప మరోటి కాదనిపిస్తుంది.
రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనా!
రాష్ట్రం ఏర్పడిన దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శాసన సభ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనే కీలకమైన హామీని ఇచ్చింది. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుండి 23 శాతానికి తగ్గిపోయిన నేపథ్యంలో వారికి స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ్ల వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
ఈ హామీని నెరవేర్చడానికి, బీసీల రాజకీయ వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయటానికి కులగణనతోపాటు డెడికేటెడ్ బీసీ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచితే ఎస్సీ, ఎస్టీల 27 శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 69 శాతానికి చేరుకుంటాయి. కానీ ఇది రిజర్వేషన్ల పరిధి 50 శాతం దాటకూడదనే సుప్రీంకోర్టు నిబంధనకు వ్యతిరేకం కాబట్టి ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇవ్వగలుగుతుందనే సందేహాలు వ్యక్తమ వుతు న్నాయి.
ఇప్పటికే గ్రామ పంచాయతీల కాల పరిమితి ముగిసి ఫిబ్రవరి నాటికి సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరిపించటం అనివార్యం. కానీ రిజ ర్వేషన్ల పెంపు అనే ఒక సుదీర్ఘ న్యాయ, రాజ్యాంగపరమైన ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం రిజర్వేషన్లు ఎలా పెం చగలుగుతుందనే సందే హాలు వ్యక్తమవుతున్నాయి.
డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్ తర్వాత స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపటం లేదా ద్వారా లోక్‌సభలో ప్రైవేట్ బిల్లు బిల్లును ప్రవేశ పెట్టడం వలన పెద్దగా ఉపయోగం ఉండదు. బీసీలకు స్థానిక సంస్థల లో 42 శాతం రిజర్వేషన్లు సాధించగలిగితే మొత్తం 12,769 గ్రామపంచా యతీలలో 5,362 పంచాయతీలలో బీసీలకు అధికారం దక్కుతుంది.
హామీల మాటేమిటి?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలులోకి రాలేదు. శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బీసీలకు రెండు నియోజకవర్గాలు కేటాయిస్తామనే హామీ ని నెరవేర్చ లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గంలో గతంలో దక్కిన ప్రాతినిధ్యం కూడా బీసీలకు దక్కలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ లో హామీ మేరకు బీసీల సంక్షేమానికి 20 వేల కోట్ల రూపాయలు కేటాయిం చాలి కానీ 9వేల కోట్లు మాత్రమే కేటాయించి మాట తప్పారు. బీసీ విద్యార్థులకు ఆంక్షలు లేకుండా ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లిస్తామనే హామీపైన ఎలాంటి విధానపరమైన నిర్ణయం ఇంతవరకు లేదు.
ఫూలే విదేశీ విద్యాజ్యోతి పథకం ద్వారా ఏటా విదేశాలకు ఉన్నత విద్య కోసం పంపించే బీసీ లబ్ధిదారుల సంఖ్యను 300 నుండి 800కు పెంచే ప్రతిపాదిత ఫైల్ ముఖ్యమంత్రి వద్ద నిర్ణయం కోసం నెలల తరబడి వేచి చూస్తూనే ఉంది. ఇవే కాకుండా కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన అనేక హామీలు అమలులోకి రావటం లేదనే అసంతృప్తి బీసీలలో నెలకొని ఉన్నది.
సంచార జాతులను పట్టించుకోరా!
రాష్ట్రంలో 136 బీసీ కులాలు ఉంటే అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీ), సంచార జాతులకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు, పథకాలు అందుబాటులోకి రావటం లేదు. విద్య,ఉద్యోగాలు, రాజకీయ పదవులు, అవకాశాలలో సంచార జాతులకు పూర్తిగా అన్యాయం జరుగుతున్నా ఇప్పటివరకు వారిగురించి ఆలో చన చేసిన ప్రభుత్వాలే లేవు. సంక్షేమమే మా చిరునామా అని చెప్పుకుంటున్న కాం గ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అయి నా వీరి అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోని దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి.
బీసీలకు అధికారం, అవకాశాలు, సంక్షేమం, ఆర్థిక భరోసా కల్పిం చకుండా విశ్వవిద్యాలయానికి పేరు పెట్ట టం, సావిత్రిబాయి ఫూలే జయంతిని మ హిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించటం, ఒక వ్యక్తికి పార్టీపరమైన అత్యున్నత పదవి కట్టబెట్టినంత మాత్రాన బీసీల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నట్లుగా భావించలేం. రాష్ట్రంలో చేపట్టిన కులగణన వివరాలను బయటపెట్టి బలహీన వర్గాల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టినప్పుడే తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగటమే కాదు ప్రభుత్వ లక్ష్యమైన ‘రైజింగ్ తెలంగాణ’ సాకారమవుతుంది.
వ్యాసకర్త సెల్: 9885465877