అరటిపండు అన్ని సీజన్లలో లభిస్తుంది. అరటిపండు తింటే ఆరోగ్యానికి అద్భుతంగా పని చేస్తుంది. అరటి పండును తరచుగా ఉదయం, సాయంత్రం స్నాక్స్‌గా తింటుంటారు కొంతమంది. శరీరంలోని వేడిని తగ్గించడంలో అరటి బాగా పని చేస్తుంది. అంతేకాకుండా.. తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. కడుపు మంట, విపరీతమైన వేడి ఉన్నవారు అరటిపండు తినకుండా ఉండటం బెటర్. చలికాలంలో అరటి తినాలా? వద్దా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది.
నిజానికి అరటిపండులో విటమిన్ ఎ, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అరటి గుండె నుంచి జీర్ణక్రియ వరకు ప్రతిదీ ఆరోగ్యంగా ఉంచుతుంది. చలికాలంలో ఎముకల నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అరటిపండులో క్యాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, నియాసిన్, రిబోఫ్లావిన్, బీ6 వంటి అవసరమైన విటమిన్లు.. ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
అరటిపండులో కరిగే, కరగని ఫైబర్ రెండూ పుష్కలంగా ఉంటాయి. కరిగే ఫైబర్ జీర్ణక్రియను మందగించే ధోరణిని కలిగి ఉంటుంది. ఇది ఎక్కువ సేపు ఆకలి కాకుండా చూస్తుంది. అరటిపండు తినడం వల్ల బరువు తగ్గుతారు. అంతేకాకుండా.. మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. చలికాలంలో అరటిపండు తింటే దగ్గు, జలుబు వస్తుంది. కాబట్టి రాత్రి పూట తినొద్దు. జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు ఉంటే.. అరటిపండు తినడం వల్ల శ్లేష్మం లేదా కఫం వంటి సమస్యలు వస్తాయి.