calender_icon.png 30 September, 2024 | 3:49 PM

తుక్కుగూడలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

30-09-2024 01:40:26 AM

  1. ప్రభుత్వ స్థలంలో షెటర్లు, ఇంటి నిర్మాణం
  2. పట్టించుకోని మున్సిపల్, ఆర్‌అండ్‌బీ అధికారులు

మహేశ్వరం,సెప్టెంబర్ ౨౯: మహేశ్వరం మండల పరిధిలోని హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 765) పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో కొందరు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి.

మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సర్దార్‌నగర్ విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన ఓ వ్యక్తి రోడ్డుపక్కన ఉన్న ఫుట్‌పాత్‌తో పాటు రోడ్డుకు ఇరువైపులా పచ్చదనం కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలంలో యథేచ్ఛగా ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. సదరు వ్యక్తి గతంలోనే ఇక్కడ నాలుగు షెటర్లను నిర్మించి వ్యాపార కలాపాలు కొనసాగిస్తుండగా తాజాగా వాటిపక్కనే మరో షెటర్ నిర్మాణం పూర్తిచేశాడు.

అలాగే పదిహేను రోజులుగా వాటి పక్కనే ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. ఇంత జరుగుతున్న ఆర్‌అండ్‌బీ,  మున్సిపల్ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనికితోడు కబ్జా చేసి నిర్మించిన ఇండ్లలో రాత్రిపూట అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయని గతంలో ఫిర్యాదులు రావడంతో పోలీసులు సదరు వ్యక్తిని మందలించినట్లు సమాచారం. అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

ఆర్‌అండ్‌బీ అధికారులతో చర్చిస్తాం

జాతీయ రహదారి పక్కన ఫుట్‌పాత్‌తో పాటు పచ్చదనం కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఆ పరిధి మున్సిపల్‌లోకి కాకుండా జాతీయ రహదారులకు సంబంధించిన శాఖకు వస్తుంది. ఫిర్యాదు వచ్చిన వెంటనే జాతీయ రహదారుల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాం. రోడ్డు, భవనాల శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.          

వెంకట్‌రామ్, మున్సిపల్ కమిషనర్, తుక్కుగూడ