“ఓ ధీర హృదయుడా! పట్టు సడలనివ్వకు చిరుమబ్బు మరుగులో సూర్యుడే దాగినా, కారు చీకట్లలో స్వర్గమే మునిగినా సడలనివ్వకు పట్టు. వరియించుగా నిన్ను విజయ మే తప్పక!’ అంటూ యువతకు లక్ష్యాన్ని ఉద్బోధించి, ప్రపంచ చరిత్రలో భారతదేశ గొప్పత నాన్ని, హిందూధర్మ విశిష్టతను అత్యంత ఘనం గా చాటి చెప్పిన ఉదయ భాస్కరుడు స్వామి వివేకానంద. ‘నరేన్’ పేరుతో ముద్దుగా పిలిచే నరేంద్రనాథ్ దత్త ‘స్వామి వివేకానంద’గా నేటికీ జ్ఞానదీపమై వెలుగొందుతూనే ఉన్నారు. కోల్‌కతా నగరంలో విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దేవి దంపతుల గారాలబిడ్డగా 1863 జనవరి 12న వివేకానంద జన్మించాడు.
చిన్ననాటి నుండి దైవభక్తి, ఏకాగ్రత కలిగి ప్రతి ఒక్కరి మన్ననలు పొందాడు. మహాగురువు రామకృష్ణ పరమహంస వద్ద చేరి వారికి ప్రియశిష్యుడుగా మారాడు. వేదాంత, యోగ, తత్త్వ శాస్త్రాలలోని అంశాలను ప్రజలకు విడమరిచి చెప్పడంలో ఆయణ్ణి మించిన వారు లేరు. స్వప్నంలో గురువు పరమహంస ప్రత్యక్షంగా దర్శనమివ్వగా, మాతా శారదాదేవి ఆజ్ఞమేరకు మొదటిసారిగా విదేశాలకు పయనమయ్యాడు. 1893 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన ‘విశ్వమత మహాసభ’లో ప్రపంచ మతగురువులు నివ్వెర పోయేలా అద్భుత రీతిలో ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు.
“నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా!” అన్న ఒక్క సంబోధనకే అందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు కురిపించారు. ఆనాటి ఆయన ప్రసంగం మానవజాతికే గొప్ప మార్గదర్శకమైంది. చికాగో సర్వమత సభల ప్రసంగాలు, తర్వాత నాలుగున్నర సంవత్సరాలపాటు అమెరికా, ఇంగ్లాండ్‌లలో చేసిన ఉపన్యాసాలద్వారా అప్పటి వరకూ భారతదేశం పట్ల పాశ్చాత్యులలో ఉండిన భావనలను మార్చడంలో చాలావరకూ విజయం సాధించారు. భారతీయ ఉత్కృష్ట సంస్కృతి, వారసత్వ సంపదల గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసి కోట్లాదిమందిలో చైతన్యాన్ని నింపారు. ఆయన సందేశాలు ఇప్పటికీ యువతరానికి వెలుగు దివ్వెలే.
ఆధునిక భారతదేశంలో పేదల అభ్యున్నతికై పాటు పడమని బోధించి వివిధ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ప్రప్రథమ యతివరేణ్యుడు వివేకానంద. రామకృష్ణ మఠం స్థాపించి అందరి అవసరాలకు బాసటగా నిలిచారు. “నా ఆశలన్నీ మీ పైనే. మీరు అనంత శక్తి సంపన్నులు. దేన్నైనా సాధించగలరు. మేల్కోండి! గమ్యం చేరేవరకూ విశ్రమించకండి!” అంటూ ఆయన ఇచ్చిన పిలుపు నేటికీ ప్రపంచ మానవాళికి వినిపిస్తూనే వుంది. ఆయన జీవిత కాలం 39 సంవత్సరాల ఆరునెలలు. అనారోగ్యంతో 1902 జులై 4న తనువు చాలించే వరకు వివేకానంద స్వామి తన ఆధ్యాత్మిక దీక్షను, కర్తవ్యాన్ని, బోధనలను కొనసాగిస్తూనే ఉన్నారు.
గడప రఘుపతిరావు
సెల్: 9963499282