calender_icon.png 17 November, 2024 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రేడింగ్ పేరుతో అరకోటి స్వాహా

17-11-2024 01:27:56 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 (విజయక్రాంతి): ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. రోజుకో కొత్త రకం మోసాలతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ వ్యాపారి(39)కి ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి రూ.అర కోటి స్వాహా చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. సదరు వ్యాపారికి వాట్సాప్‌లో ఓ మేసేజ్ వచ్చింది. ట్రేడింగ్‌లో పెట్టుబడులపై ఆసక్తి ఉంటే తమను సంప్రదించాలన్నది దాని సారాం శం. ఆసక్తి చూపిన బాధితుడు వారు సూచించిన ఫోన్ నెంబర్‌కు కాల్ చేసి ట్రేడింగ్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నాడు.

ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు బాధితుడితో అంతర్జాతీయ ఈక్విటీ ఫండ్ ఫ్లాట్ ఫామ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో అతడు రూ.48.97 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. లాభాలు వచ్చాయని మొత్తం రూ.62.13 లక్షల నగదు విత్‌డ్రా చేసుకోవాలని స్కామర్లు చెప్పారు.

కానీ, బాధితుడు వాటిని ఉపసంహరించుకోడానికి ప్రయత్నించినప్పుడు స్కామర్లు లావాదేవీని తిరస్కరిం చారు. అదనంగా 27 శాతం పన్ను చెల్లించాలని డిమాండ్ చేశారు. మోసాన్ని గ్రహించిన బాధితుడు శనివారం సైబర్‌క్రైమ్ ఫిర్యాదు నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.