- ఉస్మాన్‌సాగర్ ఔట్ ఫ్లో 226 క్యూసెక్కులు
- హిమాయత్‌సాగర్ ఔట్ ఫ్లో 320 క్యూసెక్కులు
హైదరాబాద్ సిటీబ్యూరో, రాజేంద్రనగర్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): వారం రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు గండిపేటలోని జంట జలాశయాలు ఉస్మాన్, హమాయత్ సాగర్‌లోకి భారీగా వరద వచ్చి చేరింది. జలాశయాలు ప్రస్తుతం నిండు కుండలను తలపిస్తున్నాయి. శనివారం సాయంత్రం ఇరిగేషన్ అధికారులు ఉస్మాన్‌సాగర్ రెండు గేట్లు, హిమాయత్‌సాగర్ ఒక గేటును ఎత్తి దిగువకు జలాలు వదిలారు. ఈ సందర్భంగా మూసీ పరీవాహక ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి సూచించారు.
ఉస్మాన్‌సాగర్ పూర్తి స్తాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా నిల్వ సామర్థ్యం 3.900టీఎంసీలు. జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 1788.55 అడుగులు కాగా 3.567 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 700 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 226క్యూసెక్కులు. హిమాయత్‌సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 2.970 టీఎంసీలు. ప్రస్తుత నీటిమట్టం 1761.30 అడుగులు కాగా, 2.488టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 1200 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 320 క్యూసెక్కులు.