నాల్గు చెఱగుల వేల చెరువుల
ఆనవాళ్ళు ఎక్కడా కన్పించవేమి
ధారలేమోగాని నీటి చారలైనా కనరావేమి
ఎవరి శాపమిది ఏమి పాపమిది
కరగిపోయెనే నీటి సంపద
కనరాలేదా పెద్ద ఆపద
చెరువు వళ్ళో ఇళ్ళు వాకిళ్ళు చేరిపోతే
కొండలై పెరిగిపోదా కుళ్ళు
దొరకునా దోసిళ్ళకైనా కాసిన్ని నీళ్ళు
కొనసాగితే ఇది ఇంకొన్నాళ్ళు కాదా రేపటికి చెల్లు
భాగ్యనగరమా బ్రతుకు నరకమా
నిండు కుండలైన నీటి చెరువులేవి
చెరువు గట్టుపైన పూదోటలేవి
గాలితెరలను తాకగా నెగిరిన
అలల పడగలేవి
వయసు నడవలు ప్రేమ పడవలు ఏవి
లేత బుగ్గల నిగ్గులు కొత్త సిగ్గుల ముగ్గులు ఏవి
ప్రేమలాలసత పెనవేసిన లతలేవి
భాగమతులు భారమతులైపోరే
భాగ్యనగరమా బ్రతుకు నరకమా
వాన చినుకులు చిందులేయగా
ఎగిరిపడే నీటి ముత్యములేవి
నేలనలికిన వెండి కళ్ళేపులేవి
నిజాములేలినా నీటి బీజములేసినారే
నిజము మరిచి మన నైజము చూపితిమే
గజమునైనా వదలక చెరువులను చెరపట్టినామే
చరిత్రలో మనకు చోటుండునా
పరిసరాలు పది తరాలకైతే
ఇప్పుడిది స్వర్గమని తలచి
ఎండిన పాలిండ్లను ఎంతని నలిపేమురా
ఆక్రమించి చెరువులలో ఎన్ని మేడలు కడతామురా
పాపము ఊడలై రూఢీగా పెరిగేనురా
భాగ్యనగరమా బ్రతుకు నరకమా.