calender_icon.png 23 December, 2024 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అపురూప శ్లేష కవితాప్రియుడు కామినేని మల్లారెడ్డి

21-10-2024 12:00:00 AM

“కవివై మూడు మహా ప్రబంధములు 

వక్కాణించి చాంద్రీ మహా

ర్ణవ సంకాశము కీర్తినందితివి 

మల్లారెడ్డి! ఆంధ్రాళి య

ప్పువడెన్ నీకని దానిదీర్చికొనగా 

వ్యూహించి వ్యాఖ్యాన వై

భవముం గూర్చితి నిట్టులీకృతికి 

యావత్పాఠకుల్ మెచ్చగన్‌”

అంటూ కామినేని మల్లారెడ్డి కృతమైన ‘షట్చక్రవర్తి చరిత్ర’ పద్య కావ్యానికి సుప్రసిద్ధ సాహి తీవేత్త, బహు గ్రంథకర్త ఆచార్య బేతవోలు రామబ్రహ్మం సమగ్ర వ్యాఖ్యానాన్ని అందించారు. ఈ పద్యమే మల్లారెడ్డి ప్రతిభను తెలియజేస్తున్నది.

అందుబాటులో మూడు రచనలు

కామినేని మల్లారెడ్డి నిజామాబాద్ జిల్లా బిక్కనవోలు సంస్థానాధీశుడైన కాచభూపతికి జన్మిం చిన నలుగురు పుత్రులలో చివరివాడు. జంగమరెడ్డి, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఈయన అగ్రజులు. వీరి సోదరుడైన మల్లారెడ్డి కేవలం కృతికర్త మాత్రమే కాదు, కృతిభర్త కావడమూ ఆయన సాహిత్య ప్రియత్వానికి  నిదర్శనం. ఆయన ‘సత్కవిరాజ’, ‘సర్వజ్ఞభోజ’ అనే బిరుదులతో భూషితుడైన మాన్యుడు.

కామినేని వంశపు కీర్తి పతాకగా గుర్తింపు పొందిన మల్లారెడ్డి చాలా రచనలు చేసినట్లు తెలుస్తున్నది. కాని, సాహిత్య ప్రపంచానికి అందుబాటులోకి వచ్చిన రచనలు ‘షట్చక్రవర్తి చరిత్ర’, ‘శివధర్మోత్తరము’, ‘పద్మ పురాణము’ అనేవి మాత్రమే. ఇవే సాహిత్య లోకానికి అందినవి. వీటిలో ‘షట్చక్రవర్తి చరిత్ర’లో అవతారిక లేదు. ఈ కారణంగా మల్లారెడ్డి, ఆయన సాహిత్య ప్రతిభావ్యుత్పత్తులను గురించి‘శివధర్మోత్తరము’లోని అవతారిక వల్లే తెలుస్తున్నది.

మల్లారెడ్డి ‘శివధర్మోత్తరము’లో పూర్వ మహాకవులను, వారి ప్రతిభా సామర్థ్యాలను స్తుతిస్తూ

“శంకర కవి సమంచద్భూతి రీతియు

కవిరాజ సత్కళాగౌరవంబు

శ్రీహర్ష సాత్విక స్థిరగుణమహిమంబు

స్తుతధనంజయుని నిర్దోషతయును

శబ్దశాసన బహుచాతురీవృత్తియు

సూరనార్యుని మహౌజోనిరూఢి

యల వీరభద్రుని యూరభటధ్వని

యమరేశ్వరుని విభావానుభావ

ములు విచిత్రంబులగుచు భాసిలె భవత్ప్ర

కలితోభయ భాషాధిక ప్రబంధ

సంఘములయందు గాచభూజాని మల్ల

రెడ్డి సత్కవిరాజ సర్వజ్ఞభోజ”

అన్నారు. ఈ సీస పద్యంలో ఆయన స్తుతించిన ప్రతి కవిలోని ప్రతిభాదీప్తిని, వారిలోని ప్రత్యే కతలను తాను పుణికి పుచ్చుకున్నానన్న గొప్ప ఆత్మవిశ్వాసాన్ని మల్లారెడ్డి ప్రకటించుకున్నాడు. అంతేకాదు, ‘పద్మ పురాణాన్ని’ కూడా తెలుగులో రచించడానికీ కారణాన్ని చెప్పాడు.

అనువాదానికి సర్వసమర్థుడు

ఒకానొక సందర్భంలో కుతుబ్ షాహీల ఆస్థాన కవియైన గణేశ్వరుడు, మల్లారెడ్డి సోదరుడైన కామినేని కామారెడ్డిని దర్శించాడు. అప్పుడు కామారెడ్డి “పద్మ పురాణం’లోని ‘శివరాఘవుల కథ’గల భాగాన్ని తెలుగులో చెప్పగలిగే సమర్థుడు ఎవరున్నారు?” అని ప్రశ్నించాడు. దానికి గణేశ్వర కవి సమాధానం చెబుతూ

“చొట  చొట తేనియల్ వడియు 

సూక్తులు ప్రాక్తన జన్మపుణ్య సం

ఘటితములై కవీంద్రుల కఖండ 

ముదంబు హృదంబుజంబునన్

బొటమగ జేయ గమ్రరస పూరములౌ 

మహిత ప్రబంధమల్

పటుమతి సల్పగాదగిన ప్రాజ్ఞుడు 

మల్లన్న పాలు డెంతయున్‌”

అని చెప్పాడు. ఈ విషయాన్ని ‘పద్మ పురాణం’లోని అవతారికలో స్వయంగా మల్లారెడ్డి చెప్పుకు న్నాడు. ‘పద్మ పురాణం’లోని ‘సూత సంహిత’ భాగాన్ని మల్లారెడ్డి అనువదించాడు. ఈ అనువాదానికి మల్లారెడ్డియే సర్వసమర్థుడని అప్పటి కవు లు భావించడం ఆయన కవిత్వ ప్రతిభకు నిదర్శనం.

సంస్కృతాంధ్ర పండితుడు

“ఈ ‘పద్మ పురాణం” అనువాదం ఆయ న రచనల్లోకెల్లా మిక్కిలి ప్రశస్తమైంది”గా ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం భావించారు. కవిత్వ తీరును ప్రస్తావిస్తూ, “మల్లారెడ్డికి శ్లేష కవిత్వం మీదను, శబ్దాలంకార చిత్రరచన మీదను దృష్టి యధికము. ఈతని శ్లేష కవనము నాతికఠినమై చక్కని కల్పనలు కల్గి యున్నది.

ఈతడు మంచి సంస్కృతాంధ్ర పాండిత్యము కలవాడు. తన శబ్దశాస్త్ర పరిచితిని చూపించుటకై వ్యాకరణ పదములను, అలంకారములను, రీతులను కూడా శ్లేషలలో కూర్చి పద్యములు రచించెను” అని ఖండవల్లి వారన్నారు. ఈ మాట లనుబట్టి ‘మల్లారెడ్డి శ్లేష కవిత్వ ప్రియుడని’ అర్థమవుతున్నది. ఈ విషయాన్ని ఆయనే తనదైన ఒక రచనలో వ్యక్తపరిచాడుకూడా.

“శ్లేషకవి వీవు భాషా

శేషాహివి నీవు చంద్రశేఖర పూజా

భూషణుడ వీవు కవుల

న్వేషించిన సవతు నీకు నేరీ? ధాత్రిన్‌” 

ఈ పద్యాన్నిబట్టి శ్లేషపై ఆయనకున్న ఎక్కువ మక్కువ ద్యోతకమవుతున్నది. అయితే, “మల్లారెడ్డి తొలి రచనలలో శ్లేషవైపు మొగ్గినా చివరి గ్రంథం లో మృదు భావాలకే ప్రాధాన్యమిచ్చాడు” అని ఆరుద్ర అభిప్రాయ పడ్డారు. ఇది పరిగణనలోకి తీసుకోదగ్గది. “కవిత్వ పరిణతిని సాధించే క్రమం లో మల్లారెడ్డి అపారమైన వ్యుత్పత్తిని సాధించిన ట్లు”, ఆదిపూడి ప్రభాకరకవి రచించిన ‘ఉమాపత్యభ్యుదయ’ కావ్యాన్నిబట్టి తెలుస్తున్నది. అందులోని ఈ పద్యమే దీనికి నిదర్శనం.

“పఠియించె శ్రద్ధతో బహుశాస్త్ర జాలంబు

చిత్తమెంతయు వికసించునటుల

గడియించె మిగుల శ్లాఘాపాత్రమై యొప్పు

నుభయ భాషల లోన నురు మనీష

అల్ల నేర్చెను కవితల్లజులరుదంద

మృదుమధు మధుర సద్రీతి కవిత

రచియించె పద్మ పురాణాదిక ప్రబం

ధములు నిరంకుశ ధాటి మెఱయ

నహరహము గ్రంథ పఠనంబు, నహరహంబు

పండితుల గోష్ఠి, దేవ విప్ర ప్రపూజ

లహరహము సేయు ఘనుడు సత్యవ్రతుండు

మల్లవిభుడన్న లోక సామాన్య నృపుడె.”

ఈ పద్యం మల్లారెడ్డి అధ్యయన శీలత, పండిత సాహచర్యము, పెద్దలపై గౌరవ ప్రపత్తులు మొదలైనవి వెల్లడవుతున్నాయి. పాలనలో భాగస్వా మ్యాన్ని సమర్థంగా నిర్వహిస్తూనే అధ్యయనాన్ని అహరహమూ కొనసాగిస్తూ సాహిత్య సృజనలో తన జీవితాన్ని సార్థకం చేసుకున్న మాననీయుడు మల్లారెడ్డి మహోదయుడు.

తొలి రచన ‘షట్చక్రవర్తి చరిత్ర’ 

‘షట్చక్రవర్తి చరిత్ర’ వంటి ఈ మహా ప్రబంధ రచన చేసిన కామినేని మల్లారెడ్డికి మంత్రోపదేశం చేసిన గురువు మల్లికారాధ్య పండిత వంశజుడైన ‘మల్లనారాధ్యుడు’. ఈ విషయాన్ని పెదమందడి వేంకట కృష్ణకవి ‘షట్చక్రవర్తి చరిత్ర’ పీఠికలో తెలిపారు. మల్లారెడ్డి రచనలలో తొట్టతొలుత రచిం చిన రచన ‘షట్చక్రవర్తి చరిత్ర’ అని, తరువాతి రచనలే ‘శివధర్మోత్తరము’, ‘పద్మ పురాణం” అని ఆయన పేర్కొన్నాడు. ‘శివధర్మోత్తరము’లో ‘పద్మ పురాణ’ ప్రసక్తి ఉన్నది. అందువల్ల ఈ కృతిని దానికి పూర్వపు కృతిగా భావించాలి. అంతేకాకుం డా, మల్లారెడ్డి ఇంకా పలు రచనలు చేసినట్లు కూడా జనశ్రుతి ఉన్నప్పటికీ లభ్యమైనవి మాత్రం పైన పేర్కొన్న మూడు గ్రంథాలే.

నిరర్గళ గంగా ప్రవాహం వలె సాగే శైలితో, నవ రసాలంకార యుతంగా, శ్లేష యమకాద్యలంకార ప్రాధాన్యంగా, హృద్యకావ్యంగా పేరెన్నికగన్న ‘షట్చక్రవర్తి చరిత్ర’లో హరిశ్చంద్రుని వేట సందర్భంలో ఆటవికులను గురించి

“ఒకచెంచు తనమించు ప్రకటించుకొను సంచు

కొదమ సింగంబుల గుదులు గ్రుచ్చె

నొకబోయ తన చాయ నొగిడాయ వెసగూయ

గచ్చిబెబ్బులి గుంపు నుబ్బణంచె

నొకయెర్కు తన సర్కులొగి గుర్కుమన నుర్కు

గండ భేరుండ సంఘముల గూల్చె

నొకమర్వ తనగర్వ మొగిబర్వపడి సర్వ

మేకరాశి గడుల్చె నేకలముల

గవయముల గాసరమ్ముల గండకముల,

శరభముల చామరంబుల శల్యమును

భల్లూకంబుల ఫణులను బర్హితతుల, 

విటతటంబగద్రుంచి రవ్వీరభటులు.”

అంటూ అందమైన సీసపద్యంగా చెప్పాడు. చక్కని అనుప్రాసలతో, పరిపుష్టమై భావసంపన్నతతో వేటలో ప్రతిభను చూపే ఆటవికుల ప్రతిభ ను చాటడంతోపాటు కవి ప్రతిభను కూడా ఇందు లో చూడగలం. 

ఎనిమిది ఆశ్వాసాల కావ్యం

‘షట్చక్రవర్తి చరిత్ర’ మొత్తం ఎనిమిది ఆశ్వాసాలతో ఉంది. ‘షట్చక్రవర్తులు’గా సుప్రసిద్ధులైన హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు ఈ ఆరుగురు చక్రవర్తుల కథలను అత్యంత సుందర ప్రబంధంగా రచించాడు కామినేని మల్లారెడ్డి. బిక్కన వోలు ప్రాంతానికి చెందిన ఈ కామినేని వారంద రూ దోమకొండ సంస్థానాధిపతులై ప్రజా రంజకమైన పాలన కొనసాగించిన ప్రభువులు. కందు కూరి వీరేశలింగం పొరపాటున ఈ బిక్కనవోలు గోదావరి జిల్లాకు చెందినట్లుగా చెప్పారు. కానీ,

తదనంతర సాహిత్య చరిత్రకారులు “ఇది నిజామాబాద్‌కు చెందింది”గా వ్యక్తపరిచారు. ‘ఈ సంస్థానం నైజాం ప్రభుత్వపు’ ఏలుబడిలో ఉన్నట్లుగా కూడా వారు గుర్తించారు. ఈ సంస్థానానికి చెందిన అనేక మంది కవులను గురించి తమ తమ పరిశోధనలనూ వారు కొనసాగించారు.

సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప సంకలనాన్ని ‘వర్ణన రత్నాకరము’ పేరుతో, ఇంకా అనేక ప్రాచీన ఆధునిక కావ్యాలలోని వర్ణనలను ఒకచోట చేర్చి, కూర్చిన దాసరి లక్ష్మణస్వామి, ఏ కావ్యంలో కూడా లేనన్ని వర్ణనల (దాదాపు 85 వరకూ)ను కామిరెడ్డి మల్లారెడ్డి విరచితమైన ‘షట్చక్రవర్తి చరిత్ర’ నుండి సేకరించి, ప్రకటించాడు.  మల్లారెడ్డి రచనా ప్రాభవానికి మరో తిరుగులేని నిదర్శనంగా దీనిని పేర్కొనాలి. 

గిరిజనుల భాష-యాసలో పద్యరచన

అడవిలోని వేటగాండ్రు వేటకు రాజుగారిని ప్రోత్సహిస్తూ పలికిన పలుకుల్ని ఆటవికుల భాష, యాసల్లోనే మల్లారెడ్డి కవి ప్రకటించడం విశేషం.

“సామిద్దోవము గాదే

గామంబులు సొచ్చి సంపె గంపెడు లచ్చల్

గామిడి మెకములు మనుజుల

బూములు రచ్చింప వయ్య!  పున్నెము రాజా!”

అన్న పద్యాన్ని అందమైన ఆటవికుల మాటల్లోనే రచించి చూపించాడు మల్లారెడ్డి కవీంద్రుడు. ‘స్వామి ద్రోహము- సామి ద్దోవము’, ‘గ్రామంబులు- గామంబులు’, ‘చంపె- సంపె’, ‘లక్షలు- లచ్చల్’, ‘మృగములు- మెకములు’, ‘భూములు- బూము లు’.. ఇట్లా అక్కడి వేటగాండ్ర మాటలే ఈ పద్యాన్ని వెలిగించాయి. తెలుగు పద్యం ఎటువంటి భాషకైనా ఒదుగుతుందని ఇలా నిరూపించాడు కవి.

గన్నమరాజు గిరిజా మనోహరబాబు

9949013448