calender_icon.png 27 October, 2024 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైరవీకారులకే పదవీ యోగం!

27-10-2024 01:29:24 AM

  1. కందనూల్ విద్యాశాఖలో గందరగోళం
  2. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి  కోసం ప్రత్యేక పోస్టు సృష్టించిన వైనం
  3. సతుల కోసం పతుల యత్నాలు
  4. సార్లు రాక విద్యార్థులు సతమతం

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 26 ( విజయక్రాంతి): కంటి మీద కునుకులేకుండా చదవిమరీ ఉద్యోగాలు సాధిస్తున్న ఉపాధ్యాయులు..  ఉద్యోగాలు సాధించిన తరువాత విలాసాలకు అలవాటు సమాజం చీదరించచుకునేలా వ్యవహరిస్తున్నారు.

విద్యార్థులకు విద్యబుద్ధులు నేర్పించాల్సిన ఉద్యోగులు.. అవినీతి, అక్రమాలతోపాటు చిట్టీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అలవాటు పడి బడికి ఎగనామం పెట్టేలా అనువైన తావులను వెతుక్కుంటున్నారు. కొందరు మహిళా ఉపాధ్యాయుల భర్తలు కూడా తమ సతుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

కొందరు కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఎంఈవోలు.. ఉపాధ్యాయ సంఘాల లీడర్లు కాగా మరికొందరు పొలిటికల్ లీడర్లు కూడా డీఈవో కార్యాలయానికే పరిమితం అయ్యి రాజకీయం చేసి అనుకూలమైన బడిని ఎంచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. స్పౌజ్, ఇతర ఆరోగ్య సమస్యలను వెతికి మరీ దగ్గర స్థానం కోసం పైరవీలు చేసుకుంటున్నారు. కొందరు కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే భార్యాభర్తలూ స్పౌజ్ కారణాలను చూపి స్థానచలనం అవుతున్నారని విమర్శలున్నాయి. 

నేతల చుట్టూ ప్రదక్షిణలు

సాధారణ బదిలీల అనంతరం పాఠశాలకు వెళ్లాల్సిన పంతుళ్లు అనుకూలమైన స్థానాల కోసం రాజకీయ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి. బదిలీలకు ముందు కొందరిని ప్రమోషన్లు కూడా వరించాయి. అయినా, బడికి డుమ్మా కొట్టాలన్న కుట్రలో భాగంగానే ఓ ఉపాధ్యాయుడు ముందస్తు ప్రణాళికతో విద్యార్థులు తక్కువ సంఖ్య ఉన్న పాఠశాలకు అవసరం లేకున్నా అదనంగా మరో ఖాళీ పోస్టును రీక్రియేట్ చేసేలా డీఈవో కార్యాలయంలో చక్రం తిప్పారని ఆరోపణలు బహిరంగరంగానే వినిపిస్తున్నాయి.

పాఠాలు బోధించలేక డీఈవో కార్యాలయంలోనే తిష్ట వేసి పర్మినెంట్‌గా షాడో డీఈవోగా చలామణి కావాలనే కుట్రకు తెరలేపారని తెలుస్తోంది. ఈ దిశగా అడుగులు వేస్తూ ఉన్నతాధికారులను కూడా బురిడీ కొట్టేందుకు మరో కలెక్షన్ కింగ్ సాయాన్ని కూడా తీసుకున్నట్టు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. 

షాడో డీఈవోగా..

ఒక సాధారణ ఎస్జీటీ ఉపాధ్యాయుడు స్ట్రాంగ్ టీచర్‌గా అవకాశం రావడంతో తన పరిధిలోని ఉపాధ్యాయులు, ప్రదానోపాధ్యాయులు, ఎంఈవోలను కూడా తన గుప్పెట పెట్టుకుని, అధికార దర్పాన్ని ప్రదర్శించాడు. ఉన్నత వర్గానికి చెందిన వాడు కావడంతో అజమాయిషీ చేసే కుర్చీకి అలవాటుపడ్డాడు. స్ట్రాంగ్ టీచర్ వ్యవస్థను తొలగించినా తన పరపతితో అలాగే చెలామణి అయ్యాడు.

అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంగా మారడంతో కార్యాలయ విధుల్లో తలదూర్చుతూ పెత్తనాన్ని చెలాయిస్తూ వస్తున్నాడు. ఇక ఆ కుర్చీ అధికారం రుచిమరిగి అత్యాశతో ఏకంగా షాడో డీఈవోగా చెలామణి అవుతున్నాడు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి అయినా ఏదీ పట్టించుకోకుండా ఉన్నతాధికారులు లేని ఓ కొత్త రకం పోస్టు రీక్రియేట్ చేస్తూ అనుమతులివ్వడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలే విస్మయానికి గురువుతున్నారు.

ప్రస్తుతం జిల్లా ఉపాధ్యాయ సంఘాల్లో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. బడి దొంగల కోసం విద్యార్థులను తీర్చిదిద్దే మంచి ఉపాధ్యాయులను బలితీయడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఫలితంగా విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విద్యాశాఖ వ్యవహారశైలిపై మండిపడుతున్నారు. 

పాఠశాలకు వెళ్లకుండానే సంతకాలు

పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని కస్తూర్బా పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విధులకు సక్రమంగా హాజరు కాకుండానే హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్టు తెలిసింది. సీఆర్టీల మధ్యవార్ కొనసాగుతుండగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో రాజకీయ పలుకుబడి ఉన్న తన భర్త కలుగజేసుకుని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖాదికారి విచారణకు ఆదేశించగా అక్కడికి వెళ్లిన అధికారికి మెనూతోపాటు పారిశుధ్యం అంశాలపై కూడా నిర్లక్ష్యాన్ని గమనించినట్టు సమచారం. కాగా, నివేదికలు అందుకున్న అధికారి నేతల మాటలు వింటారా? లేదా విధులకు డుమ్మాకొట్టిన వారికి మొట్టికాయలు వేస్తారా వేచిచూడాలి.