calender_icon.png 20 September, 2024 | 12:37 PM

సముచితంగా ఉచిత బస్సు

21-07-2024 12:00:00 AM

తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల విరామం అనంతరం కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు ఆరు గ్యారంటీలలో ఒకటైన ‘మహిళలకు ఉచిత బస్సు’ సర్వీసును అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరు ఆదాయాలతో బతుకు బండిని ఎన్నో ఇబ్బందులతో నడుపుతున్న మహిళలకు ఇది ఆర్థిక భారం నుండి కొంత ఉపశమనం కలిగిస్తున్నది. అయితే, మహిళల ఉచిత బస్సు సౌకర్యం ఏడు నెలలుగా అమలు జరుగుతున్న తీరు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూస్తే ‘కంచంలో అన్నం పెట్టి నోటికి తాళం వేసినటు’్లగా ఉంది. కొత్తగా ప్రారంభం అయినందున సమస్యలు రావడం సహజమేనని అనుకోవచ్చు.

కానీ ఆరు నెలలు దాటినా ఉచిత బస్సు సౌకర్యంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వ అధికార యంత్రాంగానికి పట్టినట్లు లేదు. ‘ఉచిత బస్సు సౌకర్యం’ పల్ల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు మాత్రమే వర్తిస్తుందన్న నిబంధనలు పెట్టారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదు. ఉదాహరణకు ఏజెన్సీ జిల్లాలయిన ములుగు, కొమరం భీం, జయశంకర్ భూపాలపల్లిలోని పలు మండలాల ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే నాలుగైదు గంటలు ప్రయాణం చేయాల్సి వస్తున్నది. విద్య, వైద్యం లాంటివి ప్రజలకు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఈ కోణంలోనే రవాణా సౌకర్యాలు కూడ ప్రజలకు ఉచితంగా అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు గుర్తించాలి. మారుమూల గ్రామాలకు, బస్సు సౌకర్యం లేని గ్రామాలకు ఈ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా పూనుకోవాలి.

అబద్ధపు ప్రచారాలు వద్దు

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమల్లోకి వచ్చిన తర్వాత వివిధ జిల్లాలకు వెళ్లే బస్సు సర్వీసులు, సిటీలో తిరిగే సర్వీసులు చాలా తగ్గించడం జరిగింది. ఇది ఏ కారణంగా జరిగినా ప్రయాణికులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్దీ వేచి చేశాకే బస్సులు రావడంతో మహిళలు, పురుషుల రద్దీ పెరిగి అనవసర గొడవలకు దారి తీస్తున్నది. దీనికితోడు ‘ఉచిత బస్సు సౌకర్యం’ ఉందని అవసరం లేకున్నా ప్రయాణాలు చేస్తున్నారంటూ పురుషులు, విద్యావంతులు సైతం మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక,-----బస్సుల కోసం గంటల తరబడి రోడ్లపై నిలబడి ఉండాల్సి రావడంతో మహిళలు చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది డ్రైవర్లు చెయ్యి ఎత్తినా ఆపకుండా వెళ్లిపోతున్నారు.

అంతేకాకుండా, బస్సుల్లో పురుషుల నుండి వత్తిడి, ఇతర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.----ఆర్థిక భారం పడినా, ఇబ్బందులు వచ్చిన వెనుకాడకుండా మహిళల సంక్షేమం, ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన ‘ఉచిత బస్సు సౌకర్యం’ సంపూర్ణంగా ఉపయోగపడాలని అందరూ కోరుకుంటున్నారు. ఇది లాభాల సమస్యగా చూడకుండా ప్రజా ప్రయోజనాల అంశంగా భావించాలి. ఇందులో తలెత్తుతున్న కొన్ని ఇబ్బందులను, సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులకు అవసరమైన పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులను పెంచాలి. ప్రజాసేవా రంగంగా ఆర్టీసీని మరింతగా బాగా మెరుగు పరచాలి. తద్వార పేద మహిళలకు వరంగా నిలిచిన ‘ఉచిత ప్రయాణ’ అవకాశాలను పూర్తి సౌకర్యవంతంగా మార్చాలి. ఆర్టీసీ అధికారులు ఈ రకమైన అభివృద్ధికి కావలసిన అన్ని చర్యలూ తీసుకోవాలి.

 జి. అనూరాధ