calender_icon.png 3 October, 2024 | 9:55 AM

మరో ప్రపంచయుద్ధానికి చేరువలో..

03-10-2024 12:35:05 AM

మధ్యప్రాచ్యం, తూర్పు ఐరోపాలో ఘర్షణ వాతావరణం

ఇరాన్ మిస్సైల్ దాడితో మరింత పెరిగిన ఉద్రిక్తతలు

ట్రంప్ హెచ్చరికలతో వరల్డ్‌వార్‌పై అనుమానాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ఇజ్రాయెల్‌పై ఇరా న్ భీకరదాడితో పశ్చిమాసియాతో పాటు ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఓవైపు రష్యా యుద్ధం మూడో ఏడాదికి చేరు తుండగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధం భయాలు ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి.

ఈ స్థాయిలో ఘర్షణలు నెలకొ న్న వేళ ప్రపంచయుద్ధానికి దగ్గరగా ఉన్నామనే భావన పెరుగుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరల్డ్‌వార్ గురించి హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆందోళనలు పెరిగాయి. సోషల్‌మీడియాలోనూ ఇదే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్‌వార్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉండటం గమనార్హం. 

నాటో జోక్యం చేసుకుంటే..

నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఫలితాలు విడుదలయ్యే వరకు మరో ప్రపంచయుద్ధం జరిగే అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు. అక్టోబర్ 7న హమాస్ దాడి చేసిన నాటి నుంచి గాజా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ విధ్వంసమే సృష్టించింది. హమాస్, హెజ్బొల్లా అగ్రనేతలను హతమార్చింది.

మరోవైపు యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఎర్రసముద్రంలో నౌకలపై దాడి చేస్తూ సంక్లిష్టతలను సృషిస్తున్నారు. దీంతో ఇజ్రాయెల్ చుట్టూ యుద్ధ భూమిగా మారింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు మొదలుపెడితే ఈ పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతాయి. ఈ విషయంలో అమెరికా, నాటో జోక్యం చేసుకుం టే ఆ చర్య ప్రపంచం మొత్తాన్ని గందరగోళంలోకి నెడుతుంది. 

అణుయుద్ధానికి అవకాశం!

చమురు సంపన్నమైన మిడిల్ ఈస్ట్ లో అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా తమ ప్రయోజనాలకై చేసుకున్న జోక్యంతో సౌదీ, ఇరాన్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. సౌదీ అరేబియాకు అమెరికా మిత్రదేశంగా ఉండగా, ఇరాన్, సిరియాకు రష్యా మద్దతు ఉంది. ఇరాన్‌కు వ్యూహాత్మక, రాజకీయ ప్రయోజనాల విషయం లో చైనా, ఉత్తరకొరియా మద్దతు కూడా ఉంది.

ఒకవేళ ఇరాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగితే మద్దతుదేశాలు కూడా రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా ఈ దేశాలన్నింటి వద్ద అణ్వస్త్ర సామర్థ్యం ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశమే. యుద్ధం తీవ్రస్థాయికి చేరితే అణ్వస్త్ర ప్రయోగానికీ ఏ దేశం కూడా వెనకాడకపోవచ్చు. ఈ స్థాయికి చేరకముందే ప్రపంచదేశాలు చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.