- పూర్తయిన రైల్వే టెర్మినల్
- సరైన రహదారి సౌకర్యం లేక నిలిచిన ప్రారంభోత్సవం
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాసినా స్పందన కరువు
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): జంట నగరాల రైల్వే ప్రయాణికుల కష్టాలు తొలగించేందుకు చర్లపల్లిలో 32 ఎకరాల విస్తీర్ణంలో రైల్వేశాఖ రూ.430 కోట్లతో నిర్మించిన రైల్వే టెర్మినల్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించిన మేరకు డిసెంబర్ నెలాఖరులో ప్రధా ని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగాల్సి ఉన్నది.
కానీ, రాష్ట్ర ప్రభు త్వం నుంచి సరైన సహకారం లేక టెర్మినల్ ప్రారంభోత్సవంపై నీలి నీడలు కమ్ముకున్నాయని తె లుస్తున్నది. టెర్మినల్ చేరుకునేందుకు అప్రోచ్ రోడ్ల పనులు పూర్తి చేయాలని కిషన్‌రెడ్డి సె ప్టెంబర్ 9న రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాశారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రయాణికుల విమర్శలు..
గత నెల 24వ తేదీన హైదరాబాద్‌లోని రైల్ నిలయంలో పలువురు ఎంపీలతో ద.మ.రైల్వే జీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి టెర్మినల్, అప్రోచ్ రోడ్ల నిర్మాణంపై రాష్ట్రప్రభుత్వం తీరును ఎండగట్టారు. అలాగే రాష్ట్రప్రభుత్వం రోడ్లు వేసినా, వేయకపోయినా కేంద్ర ప్రభుత్వం త్వరలో టెర్మినల్‌ను ప్రారంభిస్తుందని ప్రకటించారు.
అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడాన్ని ప్రయాణికులు తప్పుపడుతు న్నారు. అప్రోచ్ రోడ్లు లేకపోతే టెర్మినల్‌కు చేరుకోవడం కష్టతరమవుతుందని, ప్రయాణికులు సకాలంలో టెర్మినల్‌కు చేరుకోలేరని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
నిర్మాణ అంచనాలు ఇలా..
చర్లపల్లి టెర్మినల్ ముఖద్వారం వద్దకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు నిలిపేందుకు తగినంత స్థలం కావాలి. అందుకు మహాలక్ష్మీనగర్ నుంచి పాతస్టేషన్ వైపు ఉన్న రోడ్డును 80 అడుగుల మేర పెంచడంతో పాటు టెర్మినల్ ద్వారం ద్వారా ఐవోసీఎల్ మీదుగా 100 అడుగుల మేర మరో రోడ్డు విస్తరించాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది.
రోడ్ల విస్తరణకు రూ.36 కోట్ల వరకు అవసరమవుతుందని బల్దియా అంచనాలు సైతం వేసింది. కానీ, భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. మహాలక్ష్మి కాలనీలో రోడ్డు విస్తరణకు రూ.15 కోట్లకు పైగా విలువైన ఆస్తులను తొలగించాల్సి ఉన్నది. కానీ, కాలనీవా సులకు నచ్చజెప్పడంలో సర్కార్ విఫల మైందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఐవోసీఎల్ మార్గంలో 100 అడుగుల రోడ్డుకు 80శాతం అటవీ శాఖ, 20 శాతం పరిశ్రమలశాఖ నుంచి భూసేకరణ చేయాల్సి ఉండగా, అది కూడా ఇంకా పూర్తి కాలేదని సమాచారం. రాష్ట్రప్రభుత్వం భేషజాలకు పోకుండా రోడ్ల విస్తరణ చేపడితే ప్రజలకు మేలు జరుగుతుందని హైదరాబాద్ రైల్వే వినియోగదారుల సంఘం సభ్యులు సూచిస్తున్నారు.
ప్రారంభోత్సవం.. ఆలస్యం..
వాస్తవానికి రైల్వేశాఖ ఈ నెలలోనే టెర్మినల్‌ను ప్రారంభించాల్సి ఉన్నది. కానీ, అప్రోచ్ రోడ్లు పూర్తి కాకుండానే అంత పెద్ద టెర్మినల్‌ను ప్రారంభిస్తే ప్రయాణికులు ఇబ్బంది పడతారని రైల్వేశాఖ భావించింది. దీంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తూ వస్తున్నది. రైల్వేశాఖ ఉన్నతాధికారులు మరోసారి రాష్ట్రప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్లాలని, త్వరగా అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.