కమర్షియల్ టాక్స్ కమిషనర్ శ్రీదేవికి షాకిచ్చిన ప్రభుత్వం
జీఎస్టీ స్కామ్ ఫిర్యాదుతో సీఎంను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం!!
సీఎం, సీఎస్‌కు చెప్పకుండానే అధికారితో ఫిర్యాదు చేయించినట్లు ప్రచారం
డిపార్ట్‌మెంట్‌లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలు
కే నవీన్
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): కమర్షియల్ టాక్స్ కమిషనర్ శ్రీదేవికి రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. బాధ్యతలు చేపట్టిన 9 నెలలకే ఆమెను ఎస్సీ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా బదిలీ చేసింది. కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్లు.. శ్రీదేవి బదిలీకి కూడా చాలా కారణాలు ఉన్నాయి. డిసెంబర్‌లో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టింది మొదలు ఆమెపై ఆరోపణలు మొదలయ్యాయి. శనివారం ఆమె ట్రాన్సఫర్ అయ్యాక కమిషనర్ ఆఫీసు ముందు కొందరు ఉద్యోగులు పటాసులు కాల్చారు.
ఆమె బదిలీ అయిన సంతోషంతోనే వారు బాణాసంచా కాల్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెపై వ్యతిరేకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల రాష్ట్రంలో సంచలనంగా మారిన రూ.1,400 కోట్ల జీఎస్టీ స్కామ్ విషయంలోనూ శ్రీదేవి అత్యుత్సాహం చూపించినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. అప్పటికే ఆమెపై అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆమె పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. సీఎం మెప్పు పొందేందుకు జీఎస్టీ శాఖలో అవకతవకలపై అంతర్గతంగా విచారణ జరిపి రూ.1,400 కోట్ల స్కామ్ జరిగినట్లు ఆమె తేల్చారు. దీనిపై జాయింట్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉన్నా మాజీ సీఎస్ నిందితుడిగా ఉన్న ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసేముందు రేవంత్‌రెడ్డికి కానీ, సీఎస్‌కు గానీ శ్రీదేవి చెప్పలేదనే ప్రచారం జరుగుతోంది. ఆమె చూపిన అత్యుత్సాహంపై ప్రభుత్వం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నో ఆరోపణలు
జీఎస్టీ కమిషనర్‌గా శ్రీదేవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే రూ.2 కోట్లతో తన ఛాంబర్ మరమ్మతులు మొదలుపెట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండానే వీటిని ప్రారంభించినట్లు తెలుస్తోంది. రూ.2 కోట్ల బిల్లు మంజూరైనా పనులు ఇంకా పూర్తి కాలేదని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆ బిల్లును మాత్రం కాంట్రాక్టర్‌కు మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ బిల్లు ఇచ్చినందుకు ప్రతిఫలంగా సదరు కాంట్రాక్టర్ శ్రీదేవి ఫ్రాన్స్ ట్రిప్‌కు పంపించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. డిపార్ట్‌మెంట్ అవసరాల నిమిత్తం ఇటీవల 200 ల్యాట్‌టాప్‌లను కొనుగోలు చేశారు. వాస్తవానికి ఈ ల్యాప్‌టాప్‌లు అవసరం లేకున్నా వాటికోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. అంతేకాదు, తన పలుకుబడితో రెండు రోజుల్లోనే నిధులను విడుదల చేయించుకున్నట్లు సమాచారం. అయితే ఒక్కో ల్యాప్‌టాప్ ధర రూ.70,000 అయితే.. వాటిని రూ.95వేలకు కొన్నట్లు ఆమె లెక్కల్లో చూపించినట్లు తెలుస్తోంది.
సొంత వర్గానికే ప్రాధాన్యం!
రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ ఆఫీసుల్లో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకొని, వారికే శ్రీదేవి అధిక ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్గొండకు చెందిన ఓ అధికారి హైదారాబద్ కమషనర్ ఆఫీసులో డిప్యుటేషన్‌పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఆ అధికారి ఆమె అండదండలతోనే ఇక్కడ పని చేస్తున్నట్లు సమచారం. నిజామాబాద్‌కు చెందిన మరో అధికారి కూడా అనధికారింగా శ్రీదేవి ప్రోత్సాహంతో హైదరాబాద్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె భారీగా వసూళ్లకు కూడా పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసులు ఇప్పించి ఆ తర్వాత నోటీసులు పంపిన వాళ్లతో సెటిల్‌మెంట్ చేసుకునే వారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో పలు ఆరోపణలు ఎదర్కొంటున్న అధికారులు కూడా శ్రీదేవికి సహకరించినట్లు తెలుస్తోంది.
రూ.68 లక్షల కారును తిరిగి ఇస్తారా?
శ్రీదేవి కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నాక ఆఫీసు అవసరాల కోసం రూ.68లక్ష లతో ఓ ఖరీదైన కారును కొన్నారట. అయితే ఆమె సీఎంఓ, సచివాలయానికి పోయేటప్పుడే ఆ కారును వినియోగిస్తారని, ఆ తర్వాత ఆఫీస్‌కు ఆ లగ్జరీ కారులో రారని కొందరు ఉద్యోగులు అంటున్నారు. కుటుంబ అవసరాలకే ఆ కారును వినియోగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె ఇప్పుడు బదిలీ అయిన నేపథ్యంలో ఆ కారును డిపార్ట్‌మెంట్‌కు ఇస్తారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
బదిలీని ఆపేందుకు విశ్వ ప్రయత్నం?
శ్రీదేవికి తన బదిలీ విషయం శుక్రవారమే తెలిసిందని, ట్రాన్సఫర్‌ను ఆపేందుకు విశ్వప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. బదిలీని ఆపేందుకు కొందరు జేసీ స్థాయి అధికారులు సీఎస్‌ను కలిసేందుకు శుక్రవారం ప్రయత్నించారని, కానీ అది కుదరలేదట. సీఎస్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదట. దీంతో వారు చేసిన ప్రయత్నం విఫలమైనట్లు సమాచారం.