26-03-2025 10:10:53 PM
మహిళల సాధికారతపై విశేష కృషికి దక్కిన గౌరవం...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో ఆర్థిక చేరికల ద్వారా మహిళల సాధికారతపై విశేష కృషి చేసిన జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారికి గౌరవం దక్కింది. బుధవారం హైదరాబాద్-గచ్చిబౌలిలో 2023-24 సంవత్సరానికి గాను నిర్వహించిన స్త్రీ నిధి 12వ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), సెర్ప్ సి. ఈ. ఓ. దివ్య దేవరాజన్, స్త్రీ నిధి ఎం. డి. విద్యాసాగర్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా అదనపు కలెక్టర్ రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కార అవార్డును అందుకున్నారు.
స్త్రీనిధి (మెప్మా) రుణాల రికవరీలో జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 3వ స్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ... అదనపు కలెక్టర్ దీపక్ తివారి అసాధారణ నాయకత్వం, అంకితభావంతో పని చేయడంతో గుర్తింపు లభించి ప్రతిష్టాత్మకమైన అవార్డు పొందారని, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 94 శాతం రికవరీ రేటును నమోదు చేసిందని, ఈ విజయంలో అదనపు కలెక్టర్ సామర్థ్యం, నిబద్ధత కనిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్త్రీ నిధి ఆర్. ఎం. శ్రీనివాస్, మెప్మా హెడ్ మోతిరామ్, సిబ్బంది పాల్గొన్నారు.