- అభ్యర్థులకు సీఎం కార్యాలయం హామీ
- సీఎం నివాసానికి తరలివచ్చిన బాధితులు
హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): 2008-డీఎస్సీ బాధితులకు పదిహేను రోజుల్లో నియామకాలు పూర్తి చేస్తామని సీఎం కార్యాల యం హామీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ 2008-డీఎస్సీ బాధితులు సోమవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తరలివచ్చారు. 2008- డీఎస్సీ సాధన సమితి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తం గా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు సీఎం ఇంటికి తరలిరావడంతో వారిని పోలీసులు అడ్డుకొన్నారు.
ఆరుగురిని సీఎం నివాసంలోకి అనుమతించడంతో సీఎం వ్యక్తిగత కార్యదర్శి జైపాల్ రెడ్డితోపాటు ఇతర అధికారులు వారితో చర్చలు జరిపారు. రాబోయే వారం రోజుల్లో క్యాబినెట్ సబ్ కమిటీ నుంచి నివేదిక తెప్పించుకొని 15 రోజుల్లో డీఎస్సీ- 2008 బాధితుల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు డీఎస్సీ-2008 సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సభావాత్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు.
అయితే ఈ నెల 27వ తేదీ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని, చివరి అవకాశం ఇవ్వాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ హైకోర్టు ధర్మాసనానికి తెలిపారన్నారు. ఆ గడువు నేటితో ముగుస్తుందని, పదిహేనేళ్లుగా తమ ఎదురుచూపులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరదించిం దని, తమకు ఉద్యోగాలు కూడా ఇచ్చి ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సాధన సమితి ఉపాధ్యక్షుడు భాస్కర్, ప్రతినిధులు శ్రీనివాస్, ప్రమీల, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.