calender_icon.png 31 October, 2024 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణ వరకు నియామకాలు ఆపాలి

02-08-2024 01:28:46 AM

విద్య, ఉద్యోగాల్లో వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు ఇవ్వాలి

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ కంటతడి

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఉప వర్గాలుగా వర్గీకరించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్వాగతించారు. తీర్పు అనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. దశాబ్దాల పోరాటం అనంతరం తమకు అనుకూలంగా తీర్పు రావటంతో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యోగ నియామకాలను కొంతకాలం ఆపేయాలని, ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత ఆ మేరకు రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు.

‘30 ఏండ్ల మా పోరాటానికి న్యాయం జరిగింది. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ౨౦౦౪ నవంబర్ ౫న చెప్పా. ఇప్పుడు అదే నిజమైంది. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది. ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని మోదీ చొరవతీసుకొన్నందుకు ధన్యవాదాలు. మాకు సహకరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు.

వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో అమరులైనవారికి ఈ విజయం అంకితం. రిజర్వేషన్ల వ్యవస్థ ఇప్పుడు రెండో అడుగు వేయబోతున్నది. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ జీవోలు వచ్చిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఇప్పుటికే ఇచ్చిన నోటిఫికేషన్లను సవరించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. వర్గీకరణతో జనాభా లెక్కలతో పనిలేదని అన్నారు. తమ పోరాట విజయానికి గుర్తుగా త్వరలో విజయోత్సవ, ధన్యవాద సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు.