అస్తవ్యస్తంగా కొండపోచమ్మ ఆలయ నిర్వహణ
ప్రమాదపుటంచున స్వాగత తోరణం
గజ్వేల్/జగదేవ్‌పూర్, సెప్టెంబర్ 25: భక్తుల కోర్కెలు తీర్చి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కొండపోచమ్మ ఆలయ పాలకవర్గ నియామకంలో జాప్యంతో ఆలయ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్చిలో గత పాలకవర్గం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అయితే అప్పటి నుంచి నూతన పాలకవర్గాన్ని నియమించకపోవడంతోఆలయంలో పారిశుద్ధ్యం లోపించింది.
తీగుల్‌నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన ఆలయ స్వాగత తోరణం కూడా పూర్తి గా శిథిలావస్థకు చేరింది. గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఇటీవలే గొల్లపల్లికి చెందిన వంటేరు నరేందర్‌రెడ్డి నియామకం కాగా మరికొందరు ముఖ్యనేతలు కొండపోచమ్మ ఆలయం, నాచారం దేవస్థానంతో పాటు నామినేటేడ్ పోస్టుల నియామకాల్లో తమకు స్థానం దక్కుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. పాలకవర్గ నియామకం త్వరగా పూర్తయితే ఆలయ నిర్వహణ పటిష్టంగా జరుగుతుందని భక్తులు భావిస్తున్నారు.