- జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు డబుల్ డెక్ ప్లుఓవర్ నిర్మించాలి
- మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): హైకోర్టులో పూర్తిస్థాయి జడ్జీల నియామకానికి చర్యలు తీసుకోవాలని, ఇందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంటనే జోక్యం చేసుకోవాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ కోరారు. న్యాయమూర్తులు పూర్తిస్థాయిలో ఉంటే తెలంగాణకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు 42 మంది జడ్జీలు ఉండాలని నిర్ణయం తీసుకున్నా, ఇప్పటివరకు 23 మందికి మించి భర్తీ చేయ లేదని గుర్తుచేశారు. న్యాయమూర్తుల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినవారు ఎవరూ లేరని, పూర్తిస్థాయిలో జడ్జీలను నియమిస్తే దళిత గిరిజన వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ పాలనలో తాము పార్లమెంట్‌లో ఒత్తిడి చేసిన ఫలితంగా హైకోర్టు జడ్జీల సంఖ్యను 42కు పెంచారని గుర్తుచేశారు. హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగి పోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. జడ్జీలు పూర్తిస్థాయిలో ఉంటే తప్ప కేసులు తొందరగా పరిష్కారం కావని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకాలకు చొరవ చూపాలని కోరారు.
న్యాయ వ్యవస్థలో కూడా సామాజిక న్యాయం పాటించాలని, వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణ హైకోర్టులో నలుగురు జడ్జీలు ఉన్నారని చెప్పారు. జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు మెట్రో రైల్ ప్రాజెక్టు వేస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదని, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజల కష్టాలు తీరాలంటే నాగపూర్ తరహాలో జేబీఎస్ నుంచి శామీర్‌పేటకు డబుల్ డెక్ ఫ్లుఓవర్‌ను నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు.