03-04-2025 12:32:28 AM
అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య
వనపర్తి టౌన్, ఏప్రిల్ 2 : జిల్లాలో అర్హులైన వారి నుంచి రాజీవ్ యువ వికాసం పథకానికి నేరుగా(ఆఫ్ లైన్లో) కూడా దరఖాస్తులు తీసుకోవాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల ఛాంబర్ లో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.
పథకానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఇతర విధివిధానాల గురించి కమిటీ సమావేశంలో చర్చించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గా లు(ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన్, పార్శి)లకు చెందిన నిరుద్యో గ యువత, ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించిందని తెలిపారు.
రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి దరఖాస్తు గడువును ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని తెలిపారు. ఈ పథకానికి జిల్లాలోని అర్హులైన వారు నేరుగా ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాలకు వచ్చి దరఖాస్తు చేసుకునేలా కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తు ఫారంలను అందుబాటులో ఉంచాలన్నారు. నేరుగా కార్యాలయానికి వచ్చి అప్లై చేసిన వారి దరఖాస్తులు తదుపరి ఆన్లైన్ చేయించాలని చెప్పారు.
దరఖాస్తుదారులు అప్లై చేసిన తర్వాత సంబంధిత కార్పొరేషన్ల వారీగా, వారు ఏ యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు వంటి అంశాల ఆధారంగా దరఖాస్తులను వేరుచేసి పెట్టుకోవాలని సూచించారు. సమావేశంలో డి ఆర్ డి ఓ ఉమాదేవి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి అక్బర్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అబ్జాలుద్దీన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.