calender_icon.png 18 March, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి

18-03-2025 01:48:19 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్,మార్చి 17(విజయ క్రాంతి):ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ తో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తుల స్వీకరించారు.

రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన దుర్గం మల్లయ్య తాను పుట్టుకతో దివ్యాంగుడిని అని, ప్రస్తుతం చిన్న ఇంటిలో నివసిస్తున్నందున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. వాంకిడి మండల కేంద్రానికి చెందిన ఎర్ర లక్ష్మీకాంత్ తనకు గిరి వికాసం పథకం క్రింద మంజూరైన బోరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆర్జీ సమర్పించారు.

ఆసిఫాబాద్ మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన గైని మొగిలి తాను సాగు చేస్తున్న పోడు భూమిని సర్వే నిర్వహించి పట్టా మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెజ్జూర్ మండలం కుకుడ గ్రామానికి చెందిన మెరుగు రమేష్ తమ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనము మరమ్మత్తులు చేపట్టాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రకాల ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.