calender_icon.png 9 January, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త రేషన్ కార్డులకు త్వరలో దరఖాస్తులు

17-09-2024 01:28:56 AM

  1. హెల్త్ కార్డులు కూడా మంజూరు
  2. ఈ నెలాఖరు నాటికి విధివిధానాలు
  3. ఖరీఫ్ నుంచి సన్నాలకు రూ.౫౦౦ బోనస్ 
  4. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడి 
  5. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం 
  6. 21న మరోసారి భేటీ కావాలని నిర్ణయం

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని, అనంతరం కార్డులను జారీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సోమవారం కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు మంజూరు అంశంపై మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సిం హతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీ జలసౌధలో సమావేశమైంది. నూతన హెల్త్, రేషన్ కార్డుల జారీ విధివిధా నాల ఖరారుతో పాటు పెండింగ్ దరఖాస్తులపై సబ్ కమి టీ విస్తృతంగా చర్చించింది. సమావేశం అనంతరం మం త్రులు ఉత్తమ్, పొంగులేటి వివరాలను వెల్లడించారు. 

స్మార్ట్ కార్డులు

వచ్చే నెలలో అర్హులందరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వేర్వేరుగా జారీచేసే ప్రక్రియ మొదలవుతుందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. వాటిని స్మార్ట్ కార్డు రూపంలో ఇస్తామని తెలిపారు. గత పదేండ్లలో బీఆర్‌ఎస్ సర్కారు రేషన్ కార్డుల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అర్హులందరికీ, పారదర్శకంగా కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.21లక్షలకుపైగా రేషన్ కార్డులు, 2.81 కోట్లు లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు.

ఇందులో 54.45 లక్షల కార్డులు కేంద్ర ఫుడ్ సెక్యూరిటీ పరిధిలో ఉన్నాయని, మిగతావారు రాష్ట్ర పరిధిలో ఉన్నట్లు చెప్పారు. కేంద్ర పరిధిలో ఉన్న లబ్ధిదారులకు ఇచ్చే ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోలు కేంద్రం నుంచి ఒక కేజీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయని వెల్లడించారు. మిగతా వారికి 6 కిలోల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని వివరించారు. రాష్ట్రంలో అంత్యోదయ కార్డులు 5.66 లక్షలు ఉన్నాయని ఉత్తమ్ వివరించారు. 

నెలాఖరులో విధివిధానాలు

సబ్ కమిటీ ఇప్పటికే మూడుసార్లు భేటీ అయ్యిందని, ఇప్పుడు నాలుగోసారి సమావేశమైనట్లు ఉత్తమ్ చెప్పా రు. ఈ నెలాఖరులో సబ్ కమిటీ మరోసారి సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. ఆ మీటింగ్‌లోనే రేషన్ కార్డులు పొందడానికి ఎవరు అర్హులు అనేది నిర్ణయించి, విధివిధానాలను ప్రకటిస్తామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా రేషన్ కార్డుల జారీ విధానాలను అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటిక్యా కొత్త కార్డుల జారీలో నిబంధనలు ఎలా ఉండాలనే దానిపై రాజకీయ పార్టీలకు కూడా లేఖలు రాశామని తెలిపారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. 

ప్రస్తుత నిబంధనలివే

రేషన్ కార్డులకు నిబంధనలు ఎలా ఉండాన్నదానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న నిబంధనల గురించి మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారు.. తరి భూమి 3.5 ఎకరాలలోపు, చెలక భూమి 7.5 ఎకరాలలోపు ఉన్న వారికి రేషన్‌కార్డు ఇవ్వాలని ప్రస్తుతం నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లోని నిబంధనలను కూడా పరిశీలిస్తున్నట్లు వివరించారు.

ఏపీలో గ్రామాల్లో రూ.1.2 లక్షల లోపు, పట్టణాల్లో రూ.1.44 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి రేషన్ కార్డులు ఇస్తున్నారని, కర్ణాటకలో రూరల్ అయినా, అర్బన్ అయినా రూ.1.20 లక్షల కంటే తక్కువ ఉంటే ఇస్తున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను ఏ మేరకు సవరించాలన్నదానిపై ఇంకా విస్తృతంగా చర్చించాలని నిర్ణయించినట్టు వివరించారు.

పదేళ్లలో బీఆర్‌ఎస్ ఇచ్చింది 49,476 కార్డులే: పొంగులేటి

కార్డుల జారీ విధివిధానాలను ఖరారు చేసేందుకు ఈ నెల 21వ తేదీన సబ్ కమిటీ మరోసారి సమావేశం కానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. నిబంధనలు ఎలా ఉండాలన్న దానిపై ఇప్పటివరకు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన 16 మంది ప్రజాప్రతినిధులు సూచనలు ఇచ్చారని, అందులో బీఆర్‌ఎస్ నేతలు కూడా ఉన్నారని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే సూచనలు ఇస్తే.. బీఆర్‌ఎస్ సలహాలను కూడా పరిగణనలోకి తీసుకుటామని అన్నారు.

అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్, హెల్త్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఇవ్వనున్నట్లు తెలిపారు. తాము కూడా కార్డులు ఇచ్చామని గత ప్రభుత్వం చెబుతోందని, కానీ గత పదేళ్లలో వారు ఇచ్చింది 49,476 కార్డులేనని చెప్పారు. అవి కూడా ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో మాత్రమే ఇచ్చారని అన్నారు. డబుల్ బెడ్‌రూం, ఆసరా పింఛన్లు వంటి పథకాలను కూడా ఉప ఎన్నికలు జరిగిన చోట మాత్రమే ఇచ్చారని విమర్శించారు.  

ఖరీఫ్ నుంచి సన్నాలకు 500 బోనస్

ఖరీఫ్ నుంచి సన్నాలకు రూ.500 బోనస్ నందించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఖరీఫ్ నుండే క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను చెల్లించనున్నట్లు చెప్పారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.