- మెయిన్స్‌కు లెన్‌క్లియర్
- సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోలేమన్న డివిజన్ బెంచ్
హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయి దాకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కూడా నిరాకరించింది. సింగిల్ జడ్జి తీర్పు ను సమర్థించింది. జోక్యం చేసుకోవడానికి అప్పీళ్లలో ఎలాంటి మెరిట్స్ లేవని వ్యాఖ్యానించింది. పిటిషన్ వేసిన అభ్యర్థుల తీరును తప్పుబట్టింది.
ఫిబ్రవరిలో రీ నోటిఫికేషన్ ఇస్తే ఆగస్టులో సవాల్ చేస్తారా?.. ప్రిలిమ్స్ కూడా రాసి, ఫలితాలు విడుదల చేసిన తర్వాత న్యాయస్థా నాన్ని ఆశ్రయిస్తారా? అని ప్రశ్నించింది. ‘ఎనిమిది మంది అప్పీలెంట్లలో ఇద్దరు మాత్రమే ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 15 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపగా, నిపుణుల కమిటీ వాటిని పరిశీలిం చింది.
ఇలా 6,147 అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే తుది కీ విడుదల చేసిం ది. ఏ ప్రశ్న సరైందో.. కాదో.. న్యాయస్థానాలు తేల్చలేవు. నిపుణుల కమిటీనే నిర్ణ యం తీసుకోవాలి. నోటిఫికేషన్లోనే ప్రిలి మ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చెప్పింది. అక్టోబర్‌లో మెయిన్స్ అని తెలిసినా పిటిషనర్లు ఆలస్యంగా కోర్టును ఆశ్రయించారు.
ఇప్పటికే రెండేళ్ల కిత్రం నుంచి రెండుసార్లు ప్రిలి మ్స్ రద్దైంది. ఇటీవల జరిగింది మూడో ది. ఇప్పుడు మెయిన్స్ కూడా వాయిదా వేస్తే అభ్యర్థుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంటుంది. ఇక గ్రూప్ ఓ ప్రహసనంలా మారుతుంది. మెయిన్స్‌కు అర్హత సాధించిన 31,383లో 90 శాతం మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. అధికారులు కూడా సెంటర్లలో ఏర్పాట్లన్నీ చేశారు.
మరో రెండు రోజుల్లో పరీక్ష అనగా.. ఇప్పుడు వాయిదా వేయడం సరికాదు. సింగిల్ జడ్జి అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంలో అప్పీళ్లను కొట్టివేస్తున్నాం’ అని న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
ప్రిలిమినరీ ‘కీ’లో తప్పులను, ఎస్టీ రిజర్వేషన్ల పెంపును, రీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దామోదర్‌రెడ్డితో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. టీఎస్‌పీఎస్సీ వాదనలతో సంతృప్తి వ్యక్తంచేస్తూ, పిటిషన్లను కొట్టివేశారు. సాంకేతిక అంశాలను నిపుణుల కమిటీలకే వదిలేయాలని కోర్టుల జోక్యం కూడదని తీర్పునిచ్చారు.
ఈ తీర్పును సవాల్ చేస్తూ దామోదర్‌రెడ్డితో పాటు ఏడుగురు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టి ంది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు శివ, సుధీర్ వాదనలు వినిపిస్తూ.. ‘రీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కమిషన్‌కు అధికారం లేదు. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి.
2022లో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి 2024లో మళ్లీ ఇవ్వడం కారణంగా రెండేళ్లలో అర్హులు పెరిగారు. దరఖాస్తుల గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం అని చెప్పిన కమిషన్ రెండు రోజులు పెంచింది. దీంతో దాదాపు 20 వేల దరఖాస్తులు పెరిగాయి. ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచారు. తొలి నోటిఫికేషన్ నాటికి ఈ రిజర్వేషన్లు 6 శాతమే.
ఇది ఎస్టీలకు లబ్ధిచేకూర్చినా.. మిగతావారు పోస్టులు కోల్పోయే అవకాశం ఉంది. అప్పీలెంట్లు ప్రిలిమ్స్ ప్రాథమిక కీ లోని 15 ప్రశ్నలపై అభ్యంతరాలు తెలిపారు. అయినా వాటిని నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. 6 ప్రశ్నలు (41, 66, 79, 112, 114, 119) పూర్తిగా తప్పుల తడకగా ఉన్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని మెయిన్స్ వాయిదా వేయాలి. స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి కీ రూపొందించాలి’ అని కోరారు.
ఇలానే ప్రశ్నలు అడగాలని కోరలేదు...
టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ‘ఎనిమిది మందిలో ఇద్దరు మెయిన్స్‌కు అర్హత సాధించారు. కీ పై ఒక్కరు మాత్రమే అభ్యంతరం తెలిపారు. అతను కూడా సరైన సమాధానమే ఇచ్చారు. ప్రశ్నలు ఎలా అడగాలి అనేది నియామక సంస్థ పరిధిలోని అంశం. రాజ్యాంగ బద్ధమైన సంస్థను ఇలానే ప్రశ్నలు అడగాలని ఎవరూ కోరలేరు.
కీ కూడా ఇలానే ఉండాలని నిర్ణయించలేరు. 6,175 అభ్యంతరాలను స్వీకరించాం. ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ నిర్ణయం మేరకే 2 ప్రశ్నలు తొలగించాం. మెయిన్స్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 90 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. సాంకేతిక కారణాలతో దరఖాస్తులకు 2 రోజులు సమయం ఇచ్చాం. అప్పీళ్లలో మెరిట్ లేదు.. కొట్టివేయాలి’ అని విజ్ఞప్తి చేశారు.
రీనోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ ప్రిలిమ్స్ ఎలా రాశారు?
‘మానవ తప్పిదం కారణంగా కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు. తొలిసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ 5 లక్షల మంది రాశారు. రెండుసార్లు రద్దు తర్వాత 3 లక్షలే రాశారు. అభ్యర్థుల్లో నిరాసక్తత పెరిగిపోతోంది. నిరుద్యోగుల్లో తీవ్ర నైరాశ్యం ఏర్పడుతోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఇప్పుడు వాయిదా వేయడం సాధ్యం కాదు. కొందరు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడుతున్నారు.
ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. లక్షల మంది మనోభావాలనూ అర్థం చేసుకోవాలి. ఆరుగురి కోసం వేల మందిని అసహనానికి గురి చేయడం సరికాదు. 2011 మాదిరిగా ఆదేశాలిస్తే.. ఇక టీఎస్‌పీఎస్‌స్సీ ఈ గ్రూప్ పరీక్ష ఎప్పటికీ పూర్తి అవుతుందో తెలియదు. సింగిల్ జడ్జి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు.
అయినా అప్పీల్ వేయలేదు. ఏ ప్రశ్న ఏ సమాధానం సరైందో కోర్టు ఎలా తేలుస్తుంది? రీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తున్నప్పుడు ప్రిలిమ్స్ ఎలా రాశారు? పోస్టులను పెంచే, తగ్గించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. రీ నోటిఫికేషన్‌తో వచ్చిన నష్టం ఏంటీ? రద్దు చేసి అదే రోజు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు కదా?’ అని వ్యాఖ్యలు చేశారు.
‘మెయిన్స్‌కు అర్హత సాధించిన 31,383లో 90 శాతం మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారంటే ఎంతమంది మెయిన్స్ పరీక్షకు సిద్ధంగా ఉన్నారో అర్థం అవుతోంది. మరోవైపు ఈనెల 21 నుంచి పరీక్షల ఏర్పాట్లకు అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. సింగిల్ జడ్జి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనప్పుడు ఎందుకు అప్పీల్ దాఖలు చేయలేదు.
పోస్టులను పెంచే, తగ్గించే అధికారం సర్వీస్ కమిషన్‌కు ఉంది. సింగిల్ జడ్జి అన్ని అంశాలను లోతుగా పరిశీలన తర్వాతే తీర్పు వెలువరించినందున ఆ తీర్పులో తాము జోక్యం చేసుకోబోము’.. అని హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది.