ముషీరాబాద్,(విజయక్రాంతి): రెండేండ్ల చిరుప్రాయంలోనే షుగర్, లివర్ వ్యాధితో బాధపడుతున్న తమ బిడ్డ ప్రాణాలను కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాధితులు వేడుకున్నారు. ఈ మేరకు బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లాబ్ లో నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన బాధితుడి తల్లి అనూష రోధిస్తూ విలేకరులతో మాట్లాడుతూ.. తన కుమారుడు రితిక్ రెండు సంవత్సరాల వయసులో ఉన్నపుడే అధిక షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. షుగర్ వ్యాధికి చికిత్స అందిస్తుండగానే లివర్ సమస్యకు గురికావడం జరిగిందని తెలిపారు. దీంతో గత 5 ఏండ్ల నుండి వివిధ దవాఖానల్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. నిత్యం ఇన్సూలిన్ ఇంజక్షన్లు మందులు వాడడం జరుగుతుందన్నారు.
దీంతో పాటు ప్రతి నెలా పరీక్షలు, ఇన్సూలిన్ ఇంజక్షన్లు, మందులకు గాను రూ. 20 వేలు ఖర్చుపెట్టాల్సివస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు తమ దగ్గర ఉన్న ఇంటిని కూడా అమ్ముకొని చికిత్సకు వెచ్చించామన్నారు. బాధితులు రితిక్ తండ్రి వృత్తిరీత్యా డ్రైవర్ అని, ప్రస్తుతం తమ అబ్బాయికి వైద్యానికి అయ్యే ఖర్చు తమ శక్తికి మించిపోయిందని వాపోయారు. కడు పేదలమైన తాము తమ అబ్బాయికి అయ్యే వైద్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తమ కుమారుడి వైద్య ఖర్చులకు ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలని బాధితుడి తల్లి అనూష వేడుకున్నారు. పెద్దమనుసున్న దాతలు ఎవరైనా వైద్య ఖర్చులకు ఆర్ధిక సహాయం అందించాలని కోరారు. 9652335696 కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఆర్ధిక సహాయం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.