calender_icon.png 11 March, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడపిల్ల పుడితే 50 వేలు.. అబ్బాయైతే ఆవు

10-03-2025 11:40:49 PM

మాట నిలబెట్టుకుంటాం: ఎంపీ అప్పల నాయుడు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మూడవ సంతానంగా ఆడపిల్ల పుడితే రూ. 50వేలు.. మగ పిల్లాడయితే ఆవును ఇస్తానని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు. సోమవారం పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో తమ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందని అప్పల నాయుడు వెల్లడించారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉంది. డీలిమిటేషన్ ప్రక్రియతో ఉత్తరాదికి ఎక్కువ లాభం చేకూరే అవకాశముంది.

దక్షిణాదికి న్యాయం జరగాలంటే అధిక సంఖ్యలో పిల్లల్ని కనాలని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల కొన్ని పథకాలను కూడా ప్రకటించారు. అందులో భాగంగానే ఆడపిల్ల పుడితే రూ. 50వేలు.. అదే మగపిల్లాడు పుడితే తల్లులకు ఆవును బహుమతిగా ఇస్తామని ఎంపీ అప్పల నాయుడు ప్రకటించారు. ఎంపీ వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు సమర్థించారు. మరోవైపు కొత్త జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టరాదని తమిళనాడు సీఎం స్టాలిన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకునేందుకు దక్షిణాది జాయింట్ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఆయా రాష్ట్రాల సీఎంలతో సమావేశానికి స్టాలిన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.