హైదరాబాద్,(విజయక్రాంతి): దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ(Aam Aadmi Party) దూసుకుపోతుంది. తాజాగా ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో ఎన్నికల హామీని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే గురుద్వారాలు సహా అన్ని దేవాలయాల పూజారులకు గౌరవ భృతి కింద నెలకు రూ.18వేల వేతనం ఇస్తామని కేజ్రీవాల్(Arvind Kejriwal) హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. పురోహితులు, గ్రంథిలు మన మతపరమైన ఆచారాలను భవిష్యత్ తరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, దురదృష్టవశాత్తు వారి ఆర్థిక శ్రేయస్సును ఎవరు పట్టించుకోవడం లేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే నెలనెలా రూ.18వేల వేతనంగా చెల్లిస్తామని, రేపటి నుంచే ఈ పథకం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని సూచించారు. హనుమాన్ ఆలయం(Hanuman Temple)లో తానే స్వయంగా ఈ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు ఎలాంటి అడ్డుంకులు కలిగించొద్దని బీజేపీ పార్టీని కోరారు. పూజారులు, గ్రంథిలు హిందూ దేవులకు వారథిగా ఉన్నారని, వారి సంక్షేమం కోసం తలపెట్టిన ఈ పథకాన్ని అడ్డుకుంటే మాత్రం పాపం చేసినట్టే అన్నారు. కాగా, వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో ఆప్ పార్టీ వరుసగా ఎన్నికల హామీలను ప్రకటిస్తోంది. ముందుగా సంజీవని, తర్వాత మహిళా సమ్మాన్ యోజన్(Mahila Samman Yojana) తాజాగా పూజారులకు గౌరవభృతి పథకాన్ని మాజీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.