calender_icon.png 21 September, 2024 | 5:42 AM

నీటి శుద్ధి వివరాల నమోదుకు యాప్

21-09-2024 01:45:55 AM

కృష్ణా, గోదావరి తాగునీటి ప్రాజెక్టులపై ఎండీ సమీక్ష

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): నీటి శుద్ధి కేంద్రాల్లో ఎప్పటికప్పుడు నీటి నాణ్యత, క్లోరినేషన్, క్లీనింగ్ తదితర అంశాలను ఆటోమేషన్ చేసే విషయాన్ని పరిశీలించాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అన్నారు. ఆ వివరాలను నమోదు చేసేలా యాప్‌ను రూపొందించాలని ఐటీ అధికారులను ఆయన ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న  కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ట్రాన్స్‌మిషన్ లైన్లు, నిర్వహణ, వాల్వ్ లీకేజీలు, ఆకస్మికంగా ఏర్పడే పైప్‌లైన్ లీకేజీల పునరుద్ధరణ, చెల్లించిన వ్యయం వివరాలను ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. పంప్‌హౌజ్‌ల మోటార్లు పంపుచేసే క్వాంటిటీకి సంబంధించిన లాగ్ బుక్‌లు, పంపుల రిపేర్లు, నిర్వహణ పూర్తి వివరాల రికార్డులు పక్కాగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. సమీక్షలో టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ట్రాన్స్‌మిషన్ సర్కిల్ సీజీఎం రవీందర్ రెడ్డి, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. 

23న తాగునీటి సరఫరాకు అంతరాయం

నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా ఫేజ్ రింగ్ మెయిన్ ప్రశాసన్‌నగర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు ఉన్న 1200ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైపులైన్‌కు పలు ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడినందున, ఈ నెల 23న పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి అధికారులు తెలిపారు. ఈ పనులు ఈ నెల 23 ఉదయం ఆరు గంటల నుంచి 24న ఉదయం 6 గంటల వరకు జరుగుతాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఓఅండ్‌ఎం డివిజన్ నంబర్ హకీంపేట్, గోల్కొండ, టోలిచౌకి, లంగర్‌హౌజ్, షేక్‌పేట్‌తో పాటు ఓఅండ్‌ఎం డివిజన్ నంబర్6,15లో జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, తట్టిఖానా, మాదాపూర్, కొండాపూర్, డోయెన్స్, గచ్చిబౌలి ఏరియాల్లో అంతరాయం కలగనుందని వెల్లడించారు.