calender_icon.png 3 October, 2024 | 3:54 AM

24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి

03-10-2024 01:51:43 AM

  1. లేదంటే పరువునష్టం కేసు వేస్తా
  2. క్రిమినల్ కేసు వేయటానికీ వెనుకాడను
  3.  మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసు

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖకు బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తాను మంత్రిగా పనిచేస్తున్న కాలంలో సినిమారంగానికి చెందిన కొందరి ఫోన్లు ట్యాపింగ్ చేసి వారిని ఇబ్బంది

పెట్టారని సురేఖ చేసిన ఆరోపణలతోపాటు, సినీ నటులు నాగచైతన్య  విడిపోవడానికి ప్రధాన కారణం తానేనంటూ దురుద్దేశపూర్వక ఆరోపణలు చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 24 గంటల్లోగా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తన గౌరవానికి భంగం కలిగించాలన్న లక్ష్యంగానే సమంత,- నాగచైతన్య పేర్లను బయటకు లాగి మంత్రి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్య లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకుంటున్నారని ఆరోపించారు.

ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును, సినిమా నటుల పేర్లను వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. అసలు తనకు సంబంధమే లేని ఫోన్‌టాపింగ్, ఇతర అంశాలపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని లీగల్ నోటీసులో పేర్కొన్నారు.

కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఎలాంటి సాక్ష్యం లేకుండా ఆమె చేసిన అసత్య ఆరోపణలు మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయని తెలిపారు. ఆమె వ్యాఖ్యలు నిజమేనని సాధారణ ప్రజలు భ్రమపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. 

క్రిమినల్ కేసులకూ వెనుకాడను

ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని సోయి కూడా లేకుండా కొండా సురేఖ మాట్లాడటం ఆశ్చర్యానికి గురి చేసిందని కేటీఆర్ అన్నారు. గతంలో ఇదేవిధంగా మాట్లాడిన ఆమెకు ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. మంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని..

దురుద్దేశపూర్వకంగా అబద్ధాలు, అసత్యాలు మాట్లాడినందుకు తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్య త్తులో ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడవద్దని సూచించారు. 24 గంటల్లోగా మంత్రి క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావా వేయడంతోపాటు క్రిమినల్ కేసు కూడా వేస్తానని హెచ్చరించారు. 

కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నా : హరీశ్‌రావు

మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యంతర వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలపై మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.