- అప్పటివరకు సీఎం రేవంత్‌ను వదిలిపెట్టం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- అసెంబ్లీలో నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లిన మార్షల్స్
- తెలంగాణ భవన్‌కు తరలించిన పోలీసులు
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేవరకు సీఎం రేవంత్‌రెడ్డిని వదిలే ప్రసక్తిలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారక రామారావు హెచ్చరించారు. మహిళా సభ్యులను అవమానించిన సీఎంకు మహిళలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో నిరసన తెలుపుతున్న కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు ఎత్తుకెళ్లారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తెలంగాణ భవన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా పోలీసు వాహనంలోని నుంచి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం అహంకార పూరిత మొండి వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. సభలో ప్రతిపక్ష నేతలను మాట్లాడకుండా గొంతు నొక్కుతూ ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వడంలేదని, కాంగ్రెస్ సభ్యులను ఉసిగొల్పి ఇబ్బందులకు గురిచేసేలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పేవరకు నిరసన వ్యక్తం చేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దుర్మార్గంగా వ్యవహరిస్తున్న సీఎం: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, ఆయన పాలనలో రోజు రోజుకు మహిళలపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, శాసనసభ జరుగుతున్నప్పుడే కొన్ని చోట్ల అత్యాచారాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై విమర్శలు చేయడానికే అసెంబ్లీ పెట్టినట్టు ఉందన్నారు. ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
మహిళలపై పెరుగుతున్న దాడులు: ఎక్స్‌లో కేటీఆర్
కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో మహిళలపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. కేవలం 48 గంటల్లోనే సామూహిక లైంగికదాడులు సహా నాలుగు దారుణ ఘటనలు చోటు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి హోంమం త్రి లేకపోవడం, నేరాలు పెరగడం ప్రత్యక్ష నిదర్శమన్నారు. వనస్థలిపురం, శాలిగౌరా రం, నిర్మల్, పుప్పాల్‌గూడలో జరిగిన దారు ణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. దోషులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు భద్రతకు ప్రభుత్వం చర్య లు తీసుకోవాలని పేర్కొన్నారు.