27-03-2025 12:54:28 AM
* ఇది 30 శాతం కమీషన్ల ప్రభుత్వం : బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
* ఒళ్లు దగ్గర పెట్టుకో.. క్షమాపణ చెప్పాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): శాసనసభలో బుధవారం మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన ‘కమీషన్ల’ వ్యాఖ్యలు దుమారం లేపాయి. అదేస్థాయిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వ్యాఖ్యానించడంతో సభలో గందరగోళం నెలకొంది. ఇరుపక్షాల సభ్యులు ఆందోళనలు చేపట్టారు.
దీంతో సభలో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో పను లు కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నదనే ప్రచా రం జరుగుతోందని కేటీఆర్ ఆరోపణలు చేశారు. అంతకుముందు పల్లా రాజేశ్వర్ రెడ్డి హోంశాఖ, రెవెన్యూ, డబుల్ బెడ్ రూం పద్దులపై లేవనెత్తిన మాట్లాడేటప్పుడు మంత్రులు జోక్యం చేసుకొని మాట్లాడటాన్ని కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
మంత్రులు సంయమనం పాటించాలని, తమ సభ్యు లు మాట్లాడేటప్పుడు వారికి సమయమివ్వాలన్నారు. పదే పదే కలుగజేసుకొని మాట్లాడితే ఎలా అని, దయచేసి మంత్రులకు చెప్పాలని ప్యానల్ స్పీకర్ రేవూరి ప్రకాష్ రెడ్డికు కేటీఆర్ సూచించారు. 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లు కాంగ్రె స్ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
నిరూపించాలి: డిప్యూటీ సీఎం భట్టి
సభలో మాట్లాడేటప్పుడు నిబద్ధతతో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 30 శాతం కమీషన్లు అంటూ కేటీఆర్ చేసి న వ్యాఖ్యలు నిరూపించాలి.. లేదంటే సభ కు, రాష్ర్ట ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఘాటుగా స్పందించారు. ‘మేము బాధ్యత తో రాజకీయాల్లోకి వచ్చాం, అణగారిన వర్గాలు, బాధితులు, తాడితులు, పీడుతుల పక్షాన నిలబడ్డం.
మీలాగా రాష్ర్టంపై పడి అడ్డగోలుగా దోచుకోలేదు.. మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు’ అన్నారు. సభ్యులు మాట్లాడేటప్పుడు నిబద్ధతతో, ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడాలి... ఏది మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ సభలో మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తాను అన్నట్లుగా తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు.
కేటీఆర్ గౌరవంగా మాట్లాడుతారని తాను ఊహించానని, అలాకాకుండా సభనే కాదు, రాష్ట్ర ప్రజలనే తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్కషన్, డిబేట్ పేరిట సభలో ప్రతి మాట అబద్ధాలు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అన్నారు. రూ. 40 వేల కోట్ల పనులకు సంబంధించిన బిల్లులు బీఆర్‌ఎస్ నేతలు పెండింగ్లో పెట్టి పోయారు, వారి పాపం వల్ల మొత్తం లక్ష కోట్ల బిల్లులు పెండింగ్లో పడ్డాయని, పనులు చేసిన వాళ్లు బిల్లులు రాక సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు.
తాము ఒక్కొక్కటిగా సరి చేసుకుని వస్తుంటే కావాలని తమపై బురదజల్లే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులందరూ లేచి నిలబడి నిరసన తెలిపారు. మరోవైపు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్యానల్ స్పీకర్ రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఆవేదన, బాధతో డిప్యూటీ సీఎం భట్టి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన చెప్పారు.
సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్‌ఎస్..
డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలను ఖండించిన బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. పోడియం వద్దకు హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు దూసుకొచ్చారు. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటాపోటీ నినాదాలు ఇచ్చారు. అసెంబ్లీ ఎంట్రీ వద్ద మెట్ల మీద కూర్చుని వద్దురా నాయనా ఈ 20..30 శాతం కమీషన్ ప్రభుత్వం అంటూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఫస్ట్ కేటీఆరే చేశారు: ప్యానల్ స్పీకర్ రేవూరి
తొలుత కమీషన్లు అని అనుచిత వ్యాఖ్యలు చేసింది కేటీఆరేనని ప్యానల్ స్పీకర్ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హరీష్ రావు, కేటీఆర్ లేచి మాట్లాడుతుండగా...దానికి స్పీకర్ స్పందిస్తూ కేటీఆర్, హరీష్ రావు.. ఫస్ట్ స్టార్ట్ చేసిందే మీరు అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో సభలో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్‌ఎస్ సభ్యులు నిరసన చేపడుతున్న నేపథ్యంలో వారి వారి సీట్లలో కూర్చోవాలని, నిశబ్ధంగా ఉండాలని సూచించారు.
ఎంతకీ వినకపోవడంతో ఒకానొక సందర్భంగా అసహనం కోల్పోయి “ఆగండి స్వాములు” అంటూ ప్యానల్ స్పీకర్ పేర్కొన్నారు. కేటీఆర్ తనకు మైక్ ఇవాలని అడగ్గా...పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతానంటే అతనికి మాత్రమే మైక్ ఇస్తానని, కేటీఆర్‌కు ఇవ్వనని, మైకిస్తే మళ్లీ ఏంమాట్లాడుతారోనని బదులివ్వడంతో దీనికి నిరసనగా బీఆర్‌ఎస్ సభ్యులందరూ సభ నుంచి వాకౌట్ చేశారు.