త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోను ఇప్పుడు కులగణన అంశం ప్రధాన ప్రచార అంశంగా మారింది. తెలంగాణలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే జరపాలని నిర్ణయించినప్పటినుంచి కూడా ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. కులగణనతో పాటుగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాలమేరకు బీసీ కులగణన కోసం ప్రత్యేక కమిషన్‌ను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ నెల 6నుంచి రాష్ట్రవ్యాప్తంగా కులగణన ను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది కూడా. తెలంగాణలో జరిగే కులగణన దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుందని కులగణన ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.అంతేకాదు, బీసీలతో పాటుగా వెనుకబడిన అన్నివర్గ్గాలకు న్యాయం జరగడం కోసం కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్‌ను కూడా తొలగిస్తామని రాహుల్ హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు.
అప్పటినుంచి ఈ నెలలో ఎన్నికలు జరగనున్న ఈ రెండు రాష్ట్రాలు ముఖ్యంగా మహారాష్ట్రలో కులగణన అంశం ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. రాష్ట్రంలో ఎన్ని కల ప్రచారం కోసం వచ్చిన ప్రధాని మోదీ సైతం కులగణన అంశాన్ని తన ప్రసంగాల్లో ప్రధానంగా ప్రస్తావించడం మొదలుపెట్టారు. ఐక్యంగా ఉంటేనే ఓబీసీలకు బలం అని, ఓబీసీలను చీల్చడానికే కాంగ్రెస్ పార్టీ కులగణన పేరుతో కుట్ర చేస్తోందంటూ విమర్శించడం మొదలు పెట్టారు. దీనికి దీటుగా కాంగ్రెస్ కూడా ప్రధానిపై ఎదురుదాడి మొదలు పెట్టింది.
రెండురోజుల క్రితం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చించడం కోసం కాంగ్రెస్ పార్టీ ముంబయిలో ఏర్పాటు చేసిన సమావేశంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటుగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో కులగణనను కూడా భాగం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు తమ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కూడా చేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రధాని సహా బీజేపీ నేతలంతా కులగణనపై అబద్ధాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల కోసం తాము కులగణనను ప్రారంభించలేదని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలోనే కులగణన చేపడతామని హామీ ఇచ్చామని స్పష్టం చేశారు. మరోవైపు రెండురోజుల క్రితం మహా వికాస్ అఘాడీ కూటమి మహారాష్ట్ర ఎన్నికల కోసం విడుదల చేసిన మేనిఫెస్టోలో సైతం తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. ఓబీసీల అభ్యున్నతి కోసమే కులగణన అని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.
ఇప్పుడు రాష్ట్రంలో ఆ కూటమి ప్రచారంలో కులగణన కూడా ప్రధాన అంశంగా మారింది. దీంతో మహాయుతి కూటమిలో ముఖ్యంగా బీజేపీ నేతల్లో ఎక్కడ హిందూ ఓటర్లలో చీలిక వస్తుందోనన్న భయం మొదలైంది. అందుకే ప్రధాని మోదీ మొదలుకొని బీజేపీ అగ్రనేతలంతా కూడా ఇప్పుడు కులగణన పేరుతో కాంగ్రెస్ ఓబీసీలను చీల్చడానికి యత్నిస్తోందంటూ ప్రచారం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటముల మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోటీ ఉంది.
అందుకే ఇప్పుడు బీజేపీ ప్రచారంలో కులగణనకు వ్యతిరేకంగా నినాదాలకు పెద్దపీట వేసింది. ‘బాటేంగే తో కాటేంగే’, ‘ఏక్ హైతో సేఫ్ హై’ అంటూ కొత్త నినాదాలతో ప్రచారం మొదలు పెట్టింది. మహారాష్ట్రలో బీసీ ఓటర్లు పెద్ద శాతంలోనే ఉండడం, సరిహద్దు జిల్లాల్లో తెలంగాణ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను నిర్ణయించే అంశంగా కులగణన మారింది. మరి దీని ప్రభావం ఆ రెండు రాష్ట్రాలపై ఏ మేరకు ఉంటుందో తేలాలంటే ఫలితాలు వెలువడే ఈ నెల 23 వరకు ఆగాలి.