13-03-2025 11:23:08 PM
జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): ఆపారు గుర్తింపు కార్డులను నమోదు, సమగ్ర శిక్ష అభియాన్ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం నుండి ఆర్డీవో లోకేశ్వర్ రావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి లతో కలిసి సెక్టోరల్ అధికారులు, సహాయ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జూమ్ సమావేశం ద్వారా ఆపార్, సమగ్ర శిక్ష అభియాన్ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలో విద్య అభ్యసించే విద్యార్థుల అపార్ గుర్తింపు సంఖ్య నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.
పాఠశాలలలో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణాలు చేపట్టాలని, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, తరగతి గదుల మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బోధన తీరును పరిశీలించి తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్ పథకం క్రింద అమలవుతున్న కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సక్రమంగా వినియోగించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధతో విద్యాబోధన చేయాలని, వారి పరిధిలోని పాఠశాలలను సందర్శించి నివేదికలు అందించాలని, ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలల వివరాలను తెలియజేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సెక్టొరల్ అధికారులు, సహాయ గిరిజన సంక్షేమ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.