20-02-2025 01:21:46 AM
శ్రీశైలం బ్యాక్‌వాటర్, నాగార్జునసాగర్ కుడికాలువ నుంచి అక్రమ తరలింపు
జలవివాదాల నివారణకు 35 చోట్ల టెలీమెట్రీ వ్యవస్థలను ఏర్పాటుచేయండి
కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి
నెలరోజుల్లో సీతారామ ప్రాజెక్ట్‌కు అనుమతులు!
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడికాలువ నుంచి రబీ సీజన్‌లో అధిక నీటిని అక్రమంగా వాడుకుంటుందని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్త మ్‌కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. సీతారామ ప్రాజెక్టుకు నెలరోజుల్లో అనుమతులు క్లియర్ కానున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న జాతీయ నీటిపారు దలశాఖ మంత్రుల రెండోరోజు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సు అనంతరం కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్, జల్‌శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబాశ్రీ ముఖర్జీతో మంత్రి భేటి అయ్యా రు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.
నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాలకు చెందిన ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో రబీ పంటను కాపాడేందుకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరినట్టు తెలిపారు. దీనికి కేంద్రమంత్రి పాటిల్ స్పందిస్తూ.. నీటి పంపిణీ సమానంగా ఉం డేలా.. అనధికారిక నీటి వాడకాన్ని నిరోధించేలా వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.
భవిష్యత్తులో జల వివాదాలను నివారించడానికి, పారదర్శకతను మెరుగుపర్చడానికి శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆనకట్టల్లో అలాగే కృష్ణానదిపై మొత్తం 35 ప్రాంతాల్లో టెలిమెట్రీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఉత్తమ్ కోరారు.
ఈ వ్యవస్థల్లో నీటి వినియోగాన్ని రియల్‌టైమ్‌లో గమనించేందుకు, కేటాయించిన వాటాను పాటించేలా చేయడం లో ఉపయోగపడుతాయని వివరించారు. దీనిపై కేంద్రమంత్రి స్పందిస్తూ.. నీటి మా నిటరింగ్ మెరుగుపరిచే వ్యవస్థల ప్రాముఖ్యతను అంగీకరించినట్టు తెలిపారు.
మేడిగడ్డపై నెలాఖరులోపు నివేదిక..
మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నెలాఖరులోపు నివేదిక ఇవ్వాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ కింద ఎన్‌డీఎస్‌ఏ మేడిగడ్డ కుంగడంపై విచారణ ఒక సంవత్సర కాలంగా కొనసాగుతోందని, తక్షణమే నివేదిక విడుదల చేసి, తదుపరి చర్యల కోసం సిఫార్సులు అందించాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. దీనిపై కేంద్రమంత్రి స్పందిస్తూ.. నివేదికను ఈ నెలాఖరులోగా అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేయ డం, నిధులు అందుబాటులో ఉండేలా చూడటం అవసరమని.. పాలమూరు సీతారామ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని మం త్రి విజ్ఞప్తి చేశారు. పాలమూరు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై స్పందించిన కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ముఖర్జీ తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సున్నా వడ్డీతో.. 50 ఏండ్ల రుణ విరామంతో నిధులు ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టు అనుమతులను ఒక నెలరోజుల్లోగా మంజూరు చేస్తామని తెలిపారు.
ఆనకట్టల మరమ్మత్తులకు డీఆర్‌ఐపీ నిధులు..
వరల్డ్ బ్యాంకు సహకారం అందిస్తున్న డ్యాం రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ (డీఆర్‌ఐపీ) నిధులను నాగార్జునసాగర్, శ్రీశైలం ఆనకట్టల మరమ్మతులకు, అలాగే తెలంగాణలోని ఇతర సాగునీటి ప్రాజె క్టులు, నదీ పరిరక్షణ, మట్టి నిక్షేపాల తొలగింపునకు వినియోగించాలని కేంద్రం చేసిన సూచనల ప్రకారం ముందుకు వెళ్తామని మంత్రి తెలిపారు. కేంద్రమంత్రిని కలిసిన సమయంలో మంత్రి వెంట రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జా ఉన్నారు.
మూసీ పునరుజ్జీవానికి సహకరించండి
మూసీనది పునరుజ్జీవంతో పాటు గోదావరి-మూసీ లింక్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని మంత్రి ఉత్తమ్ ఈ సందర్భంగా కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్రమంత్రి తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
కేంద్ర జోక్యం అవసరం..
తెలంగాణకు తగిన నీటివాటా హక్కును సాధించేందుకు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ-2) విచారణను వేగవంతం చేయాలని, ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రమంత్రి పాటిల్‌ను కోరారు. తెలంగాణ ప్రభుత్వం తన నీటి హక్కుల కోసం పోరాడుతున్న అంశానికి కేంద్రమంత్రితో భేటి సందర్భంగా మద్ధతు లభించిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు వేగంగా సాగడానికి ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన రెండు రోజుల జాతీయ స్థాయి నీటిపారుదల శాఖా మంత్రుల సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.