సిమ్లా, జనవరి 9: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు జిల్లాలో జరిగిన పారాగ్లుడింగ్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ పర్యాటకుడు మృతి చెందాడు. మృతుడిని తాడి మహేశ్ రెడ్డి(32)గా గుర్తించారు.
మంగళవారం మహేశ్ రెడ్డి పారాగ్లుడింగ్ చేస్తూ మనాలికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైసన్ వద్ద టేకాఫ్ చేయడానికి ప్రయత్నించాడు. అకస్మాత్తుగా వీచిన గాలి గ్లుడర్ మార్గానికి అంతరాయం కలిగించింది. దీంతో గ్లుడర్ పైకి వెళ్లకుండా కిందకు పడిపోగా మహేశ్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి.
వెంటనే అక్కడున్న వారు చికిత్స కోసం అతన్ని టేకాఫ్ పాయింట్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుంటార్‌లోని హరిహర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మహేశ్ రెడ్డి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రమాదంలో అధికారులు విచారణ చేపట్టారు.
హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది అక్టోబర్‌లో కాంగ్రా జిల్లాలోని బిర్ పారా గ్లుడింగ్ ప్రపంచకప్ 2024కి ముందు జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు విదేశీయులు చనిపోయారు. ఓ ప్రమాదం లో గ్లుడర్లు ఢీకొన్నాయి.