calender_icon.png 19 March, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిమినల్ కేసుల్లో ఏపీ ఎమ్మెల్యేలు టాప్

19-03-2025 01:37:27 AM

  1. 175 మందిలో 138 మందిపై కేసులు
  2. పార్టీల వారీగా టీడీపీ ప్రజాప్రతినిధులే అత్యధికం
  3. రెండో స్థానంలో కేరళ, తెలంగాణ ఎమ్మెల్యేలు
  4. దేశవ్యాప్తంగా 45% మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
  5. హత్యారోపణలు ఉన్నవారు 29 శాతం
  6. ఏడీఆర్  నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 18: క్రిమినల్ కేసులు లేని రాజకీయ నాయకులు ఉంటారా.. ఉండవచ్చు. కానీ, దేశంలోని ఎమ్మెల్యేల్లో దాదాపు సగం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 45 శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు తాజా నివేదికలో వెల్లడైంది. వీరిలో 29 శాతం మంది ఎమ్మెల్యేలు హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి తీవ్రవైన అభియోగాలను ఎదుర్కొంటున్నట్టు నివేదిక స్పష్టం చేసింది.

ఈ నివేదిక ప్రకారం అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను కలిగిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉంది. ఏపీలో 79శాతం అంటే 138 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి  మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేలు ఉండగా 4,092 మంది ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్లను ది అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ విశ్లేషించి నివేదికను రూపొందించింది.

తన నివేదికలోని అంశాలను ఏడీఆర్ తాజాగా బయటపెట్టింది. అందులోని వివరాల ప్రకారం అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను కలిగిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్  టాప్‌లో ఉండగా రెండోస్థానంలో కేరళ, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 69శాతం మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.

అలాగే బీహార్‌లో 66%, మహారాష్ట్రలో 65%, తమిళనాడులో 59% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. తీవ్రమైన అభి యోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల ను కలిగిన రాష్ట్రాల జాబితాలోనూ ఏపీ ముందుంది.

ఏపీలో 56% అంటే 98 మంది ఎమ్మెల్యేలు తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఈ జాబి తాలో రెండో స్థానంలో తెలంగాణ ఉండ గా, బిహార్ మూడోస్థానంలో ఉం ది. తెలంగాణలో 50% మంది, బిహార్‌లో 49% మంది ఎమ్మెల్యేలు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. 

పార్టీల వారీగా

* క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను కలిగిన పార్టీల జాబితాలో ఏపీలోని టీడీపీ టాప్‌లో ఉంది. ఏపీ అసెంబ్లీలో టీడీపీ 135 మంది సభ్యులను కలిగి ఉండగా ఇందులో 115 మంది ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. వీరిలో 82 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. 

* తమిళనాడులోని అధికార డీఎంకేలో 98 మంది (74% మంది) ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 42 మంది తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

* బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్‌లో 230 మందికిగాను 95 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 78 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. 

* బీజేపీకి చెందిన 1,653 మంది ఎమ్మెల్యేల్లో 39శాతం అంటే 638 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో 436 మంది ఎమ్మెల్యేలు తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 

* కాంగ్రెస్‌కు చెందిన 646 మంది ఎమ్మెల్యేల్లో 339 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండగా ఇందులో 194 మంది తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. 

* ఆప్ 123 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉండగా ఇందులో 69 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నా యి. వీరిలో 35 మంది ఎమ్మెల్యేలు తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. 

దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల్లో 54 మందిపై మర్డర్ కేసులు ఉన్నాయి. అలాగే 226 మంది ఎమ్మెల్యేలు హత్యాయత్నం కేసులు ఎదుర్కొంటున్నారు. అదనంగా 127 మంది ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. వీరిలో 13 మంది ఎమ్మెల్యేలు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల్లో 3 శాతం మంది ఎమ్మెల్యేలను బిలియనీర్లుగా ఏడీఆర్ నివేదికలో పేర్కొంది. ఎమ్మెల్యేలు సగటున రూ.17.92 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉండగా నేరారోపణలు ఎదుర్కొంటున్న  ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.20.97 కోట్లు ఉన్నట్టు పేర్కొంది.