అమరావతి: ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్(Andhra Pradesh Minister Nara Lokesh) నిన్న రాత్రి కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు కీలకమైన వినతులు లోకేష్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని లోకేశ్(Lokesh) కేంద్ర మంత్రిని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence)లో అభివృద్ధి చెందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి రాష్ట్రం సర్వసన్నద్ధంగా ఉందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ మద్దతును కోరినట్లు ఆయన ఉద్ఘాటించారు. అదనంగా, విశాఖపట్నంలో ప్రణాళికాబద్ధంగా రాబోయే డేటా సిటీకి సహాయాన్ని అభ్యర్థించారు.
కేంద్ర మంత్రితో భేటీ అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ... ఢిల్లీ రైల్ భవన్(Delhi Rail Bhawan)లో కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌ని కలిసానని చెప్పారు. రైల్వే బడ్జెట్ లో ఏపీకి అత్యధికంగా కేటాయింపులు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించాను. ఆంధ్రప్రదేశ్ లో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధి కి తీసుకుంటున్న చర్యలు, నూతనంగా తీసుకొచ్చిన పాలసీల గురించి వివరించానని పేర్కొన్నారు.
ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్(AI Center of Excellence for Education) కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడించారు. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ విప్లవంతో డేటా సిటీలకు పెద్దఎత్తున డిమాండ్ రాబోతుందన్నారు. ఏఐతో వస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ డేటా సిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రత్యేక పాలసీల రూపకల్పన, సింగిల్ విండో పద్ధతిలో కేంద్రం నుండి అనుమతులు సులభతరం చేయాలని కోరానని తెలిపారు. మంగళగిరి(Mangalagiri)లో ఎన్నో ఏళ్లుగా 800 నిరుపేద కుటుంబాలు నిరుపయోగంగా ఉన్న రైల్వే భూముల్లో నివసిస్తున్నారు. మానవతా దృక్పథంతో ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించండని కోరానన్నారు. అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేస్తామని చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు.