calender_icon.png 18 October, 2024 | 3:22 AM

అప్పుల్లో ఏపీనే టాప్

16-10-2024 02:05:18 AM

రెండో స్థానంలో తెలంగాణ

18ఏళ్లకు పైబడిన వారి నుంచి శాంపిల్స్ సేకరణ

రూ.500 నుంచి ఆ పైన అప్పులున్న వారిపై సర్వే

ఏపీలో ప్రతి లక్ష మందిలో 60,092 మందికి అప్పు

మన స్టేట్‌లో 42,407 మందికి రుణం

నివేదికను వెల్లడించిన కేంద్ర గణాంకాల శాఖ

ఈ రిపోర్టుకు భిన్నంగా నాబార్డ్ సర్వే 

రుణాల్లో తెలంగాణ కుటుంబాలు మొదటి స్థానంలో ఉన్నట్లు వెల్లడి

హైదరాబాద్, అక్టోబర్ 1౫(విజయక్రాంతి): వ్యక్తిగత అప్పులు చేయడంలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే టాప్‌లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే తెలంగాణ రెండో స్థానంలో నిలిచినట్లు కేంద్రం వెల్లడించింది. 2022 జూన్ నుంచి 2023 జూలై మధ్యకాలంలో దేశంలోని ప్రజల ఆర్థిక పరిస్థితులపై కేంద్ర గణాంకాల శాఖ సర్వే నిర్వహించింది.

ఆ సర్వేలో దేశంలో 18ఏళ్ల పైబడి రూ.500 నుంచి ఆపైన బ్యాంకులు, యాప్‌లు, ఇతర సంస్థలు ద్వారా రుణం తీసుకున్న వారి శాంపిల్స్‌ను రాండమ్‌గా సేకరించింది. వాటిని క్రోడీకరించి తాజాగా రాష్ట్రాల వారీగా జాబితాను విడుదల చేసింది. అయితే ఇదే సమయంలో నాబార్డ్ విడుదల చేసిన సర్వే ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

కుటుంబాల అప్పులు, ఆదాయాలపై 2021 మధ్య కాలంలో ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్సియల్ ఇంక్లూజివ్ పేరుతో నాబార్డ్ సర్వే చేసింది. ఇందులో అప్పులు ఉన్న కుటుంబాల్లో తెలంగాణ మొదటి స్థానం, ఏపీ రెండో స్థానంలో ఉన్నట్లు చెప్పింది. తెలంగాణలో ఒక్కో కుటుంబంపై రూ.1.29లక్షలు వెల్లడించింది. దేశంలో అప్పులు ఉన్న కుటుంబాల సగటు 52శాతం అయితే తెలంగాణలో అది 92శాతం, ఏపీలో 86శాతం ఉంది.

తెలంగాణలో 42,407మందికి అప్పు..

తెలంగాణలో 18ఏళ్లు పైబడిన ప్రతి లక్ష మందిలో 42,407మందికి అప్పు ఉన్నట్లు చెప్పింది. అలాగే ఏపీలో ప్రతి లక్షమందిలో 60,092 మందికి రుణం ఉన్నట్లు వెల్లడించింది. సర్వే ప్రకారం దేశ సగటు కంటే ఇది చాలా అధికం. దేశం మొత్తాన్ని విశ్లేషిస్తే ప్రతి లక్ష మందిలో 18,322 మంది మాత్రమే రుణం ఉన్న వారు ఉన్నట్లు కేంద్రం చెప్పింది.

జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు దాదాపు రెండున్నర రేట్లు ఎక్కువగా ఉంది. ఏపీ మూడున్నర రేట్లు అధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే కేంద్రం శాంపిల్స్‌గా తీసుకున్న రుణాలు కనిష్టంగా రూ.500, గరిష్టంగా రూ.లక్షలు లేదా రూ.కోట్ల వరకు ఎంతైనా ఉండొచ్చు. ప్రైవేటుగా తీసుకున్న రుణాలను కేంద్రం లెక్కగట్టలేదు.

తెలంగాణలో 1,512 బృందాలతో సర్వే..

తెలంగాణలో 1,512 బృందాలతో గణాంకాల శాఖ సర్వే చేసింది. ఇందులో సెంట్రల్, స్టేట్ రెండు బృందాలు ఉన్నాయి.  ఇవి గ్రామాలు, పట్టణాల్లో వేర్వేరుగా శాంపిల్స్ సేకరించాయి. సెంట్రల్‌కు చెందిన 240 బృందాలు గ్రామాల్లో , పట్టణాల్లో 264 బృందాలు సర్వే చేశాయి. రాష్ట్రానికి చెందినవి 480 బృందాలు గ్రామాల్లో , పట్టణాల్లో 528 బృందాలు శాంపిల్స్ సేకరించాయి.

ఏపీలో స్టేట్, సెంట్రల్ బృందాలు కలిపి మొత్తం 856 సర్వే చేశాయి. సర్వే నిర్వహించిన తేదీ నాటికి ఉన్న రుణాల ఆధారంగా కేంద్రం ఈ జాబితాను తయారు చేసింది. దేశంలో పట్టణాలు, గ్రామాలు కలిపి మొత్తం 15,298 ప్రాంతాల్లో ఈ సర్వే చేశారు. మొత్తం 3,02,086 కుటుంబాలు, పురుషులు, మహిళలు కలిపి 18ఏళ్లు పైబడిన  12,99,988 మంది నుంచి నుంచి శాంపిల్స్ సేకరించారు.

ప్రతి ఇద్దరిలో ఒకరికి అప్పు..

గ్రామాలు, పట్టణాల్లో కేంద్రం వేర్వేరుగా సర్వే చేసింది. అలాగే, పురుషులు, మహిళల నుంచి కూడా విడివిడిగా శాంపిల్స్‌ను సేకరించింది. నివేదిక ప్రకారం పట్టణాల్లో కాని, గ్రామాల్లో కాని అప్పు తీసుకున్నవారిలో పురుషులే అధికంగా ఉండటం గమనార్హం.

తెలంగాణలో పురుషుల్లో 54,538 మందికి, మహిళల్లో 30,287 మందికి రుణాలు ఉన్నట్లు నివేదిక చెప్పింది. ఏపీలోనూ పురుషుల్లో 60,144మంది, మహిళల్లో 60,043 మంది క్రెడిట్ ఉన్నట్లు నివేదిక చెబుతోంది. రెండు రాష్ట్రాల సగటును కలిపితే సగటున దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరికి రూ.500 నుంచి ఆపైన అప్పు ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ప్రతి లక్షమందిలో రుణాలు ఉన్న వారి సంఖ్య 

తెలంగాణ పురుషులు మహిళలు మొత్తం సగటు

(ప్రతి లక్షమందిలో) 

గ్రామీణం 61,765 39,265 50,289

పట్టణం 44,829 17,031 31,309

రాష్ట్రం మొత్తం 54,538 30,287 42,407

ఆంధ్రప్రదేశ్ పురుషులు మహిళలు మొత్తం సగటు

(ప్రతి లక్షమందిలో) 

గ్రామీణం 60,427 64,953 62,735

పట్టణం 59,495 48,887 54,058

రాష్ట్రం మొత్తం 60,144 60,043 60,092