సీఎం నారా చంద్రబాబునాయుడు
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానమని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని సచివాలయంలో బుధవారం బీపీసీఎల్, విన్ ఫాస్ట్ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బీపీసీఎల్ చైర్మన్ అండ్ ఎండీ కృష్ణకుమార్‌తోతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 4-5 వేల ఎకరాలు అవసరం ఉంటుందని కంపెనీ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 90 రోజుల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికతో రావాలని కంపెనీ ప్రతినిధులకు సీఎం సూచించారు. అనంతరం సీఎం విన్ ఫాస్ట్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈవీ, బ్యాటరీ తయారీ ప్లాంట్‌కు ముందుకు రావాలని సీఎం వారికి సూచించారు. ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు.