12-04-2025 12:00:27 PM
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు(AP Inter exam results) అధికారికంగా విడుదలయ్యాయి. విద్య, సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా ఈ ప్రకటన చేశారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in లో తమ ఫలితాలను చేసుకోవచ్చని పేర్కొన్నారు. అదనంగా, విద్యార్థులు మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు “హాయ్” సందేశం పంపడం ద్వారా కూడా తమ ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు.
ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి(AP Inter 1st Year Results 2025) సంవత్సరం ఉత్తీర్ణత శాతం 70 శాతంగా ఉండగా, రెండవ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 83 శాతానికి చేరుకుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక విద్యా సంస్థలలో మంచి ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో రెండవ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69 శాతానికి చేరుకుందని, ఇది గత పదేళ్లలో అత్యధికమని ఆయన ప్రత్యేక సంతృప్తి వ్యక్తం చేశారు. “ఈ విజయం విద్యార్థులు, జూనియర్ లెక్చరర్ల కృషికి నిదర్శనం” అని నారా లోకేష్ పేర్కొన్నారు.
ఉత్తీర్ణత సాధించని వారిని ప్రోత్సహిస్తూ, నారా లోకేష్ వారిని నిరుత్సాహపడవద్దని, బదులుగా దీనిని ఒక మెట్టుగా భావించి, కొత్త ప్రయత్నంతో అధ్యయనం చేయాలని కోరారు. విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాలి.. జీవితంలో ఉన్నతస్థితికి ఎదగాలి ఆయన వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలకు కలిపి పది లక్షలకు పైగా విద్యార్థులు హాజరు కావడం విశేషం. ఇంటర్ తొలి ఏడాది, రెండో ఏడాది(AP Intermediate 2nd Year Results 2025) ఫలితాల్లో 85 శాతం, 93 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఇంటర్ తొలి ఏడాది ఫలితాల్లో 54 శాతం ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లా ఆఖరిస్థానంలో ఉండగా, ఇంటర్ రెండో ఏడాది ఫలితాల్లో 73 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి జిల్లా ఆఖరిస్థానంలో ఉందని ఏపీ విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.