calender_icon.png 22 September, 2024 | 9:05 AM

ఏపీకి రాజధాని లేనందుకే ఎక్కువ నిధులు

28-07-2024 02:10:13 AM

  1. మోదీ ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమే 
  2. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం 
  3. కేంద్ర సహాయ మంత్రి రామదాస్ అథవాలే స్పష్టం

మెదక్, జూలై 27 (విజయక్రాంతి): ఏపీకి రాజధాని లేనందువల్లే ఆ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించామని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహా య మంత్రి రామదాస్ అథవాలే అన్నారు. శనివారం ఆయన మెదక్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మోదీ ప్రభు త్వం ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’ కోసం పనిచేస్తుందన్నారు. ముద్ర రుణాలను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచిందని చెప్పారు. మోదీ చేపట్టే అభివృద్ధికి ఎలాంటి గ్యారంటీ అవసరం లేదని చెప్పారు.

ఉజ్వల యోజన పథకంతో ఇంటింటికీ గ్యాస్ అందిస్తున్నామని, ప్రధాన మంత్రి ఆవాస్ యోజ న ద్వారా పేదలకు మూడు కోట్ల ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇందులో తెలంగాణకు సైతం ఇండ్లు వస్తాయని తెలిపారు. దేశంలోని 85 శాతం పేదల కోసం మోదీ సర్కార్ పనిచేస్తుందని పేర్కొన్నారు. తమకు 8 మంది ఎంపీలను ఇచ్చిన తెలంగాణ అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, ఐదేళ్లపాటు మోదీ నేతృత్వంలో పనిచేస్తామని పేర్కొన్నారు.  సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.