అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలను ప్రతిపాదించింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్(Inter first year Exam) సంవత్సరాంత పరీక్షలు తొలగింపు ప్రతిపాదన చేసింది. కళాశాలలే ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదించింది. ఒక ప్రధాన ప్రకటనలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలను నిలిపివేయాలని నిర్ణయించింది.
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (Kritika Shukla, Secretary of the Board of Intermediate Education Andhra Pradesh) సెక్రటరీ కృతికా శుక్లా మాట్లాడుతూ, విద్యార్థులపై అకడమిక్ ఒత్తిడిని తగ్గించడానికి బోర్డు పూర్తిగా ద్వితీయ సంవత్సరం పరీక్షలపై దృష్టి పెడుతుందని చెప్పారు. జనవరి 26, 2025 వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలను ఆహ్వానిస్తున్నామని సూచించారు. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని పేర్కొన్న ఆమె జాతీయ కరికలం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. సైన్స్, ఆర్ట్స్, భాషా సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామని కృతికా శుక్లా పేర్కొన్నారు. 2024-25 నుంచి పదోతరగతిలో ఎన్ సీఈఆర్ టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టారని విద్యామండలి కార్యదర్శి తెలిపారు.