27-02-2025 01:57:29 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : కృష్ణా జలాల వినియోగంలో మొదటినుంచి అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న ఏపీ అధికారులు బుధవారం సైతం అదే వైఖరిని కొనసాగిం చారు. జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశానికి హాజరవుతామని చెప్పిన ఏపీ అధికారులు.. డుమ్మా కొట్టారు.
ఈ వేసవికి కృష్ణానదీ జలాల పంపకాలకు సంబంధించి ఎంతో కీలకమైన ఈ భేటీకి ఏపీ నుంచి ఒక్క అధికారి కూడా హాజరుకాకపోవడం అంటే బోర్డుపై వారికి కనీసం మర్యాద లేనట్లేనని భావించాల్సి ఉం టుందని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. ఇప్పటికే ఒకసారి భేటీకి గైర్హాజరైన ఏపీ అధికారులు, మరోసారి అదేతీ రుగా ప్రవర్తించడంపై ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు.
అయితే బుధవా రం కేఆర్‌ఎంబీ సమావేశానికి హాజరైన రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ అనిల్‌కుమార్ సమావేశాన్ని మినిట్స్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇప్పటికే ఏపీకి కేటాయించిన నీటి కంటే అత్యధికంగా వాడుకున్నారని.. అందుకే మల్యాల ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు, ముచ్చిమర్రు ఎత్తిపోతల నుంచి నీటి తరలింపును తక్షణం ఆపేయాలని డిమాండ్ చేశారు.
శ్రీశైలం నీటిలో కనీ సం చుక్క నీటిని కూడా ఏపీ ముట్టుకోకుండా చూడాలని తెలంగాణ డిమాండ్ చేసింది. అలాగే నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా అక్రమంగా తరలిస్తున్న నీటిని వెంటనే ఆపేయా లని తెలంగాణ అధికారులు కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకుపోయారు. కాగా.. తెలంగాణ, ఏపీ ఉమ్మడి ప్రాజెక్టులలో మిగిలిపోయిన నీటి వినియోగంపై చర్చిండానికి కేఆర్‌ఎంబీ ఈనెల 21న ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి కూడా ఏపీ అధికారులు రాలేదు.
దాంతో సమావేశాన్ని 24వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వారికి కేటాయించిన దానికంటే అధికంగా పెద్దఎత్తున నీటిని వాడేసిన ఏపీ.. కేఆర్‌ఎంబీ సమావేశానికి హాజరైతే బోర్డు చెప్పిన ప్రకారం నడుచుకోవాల్సి వస్తుందని, అందుకే మీటింగ్‌కు రాలేదని తెలంగాణ ఆరోపిస్తోంది. కేఆర్‌ఎంబీ ఈ విషయం లో తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని.. ఇది తెలంగాణ ప్రజలను తీవ్రంగా అన్యాయానికి గురిచేయడమే అని అధికారులు చెబుతున్నారు. కేఆర్‌ఎంబీ గురువారం మరోసారి సమావేశం కానుంది.
ఏపీ మొండివాదన..
తెలంగాణ, ఏపీ ఉమ్మడి ప్రాజెక్టులలోని ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ నుంచి తెలంగాణ 131, ఏపీ 27 టీఎంసీలను వినియోగించుకోవాలని కేఆర్‌ఎంబీ ఇప్పటికే రెండు రాష్ట్రాల కు సూచించింది. కానీ శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో ప్రస్తుత నిల్వలో భాగంగా నికర లభ్యత 100 టీఎంసీలకంటే తక్కువగా ఉంది.
ఏపీ ఇప్పటికే పూర్తి వాటాను వినియోగించుకున్నా, ఆ రాష్ట్రానికి అదనంగా 27 టీఎంసీలు ఇవ్వడం ఏంటని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇష్టానుసారంగా నీటిని తరలించుకుపోతున్న తీరుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే ఏపీ మాత్రం ఇంకా అధికంగానే నీటిని తీసుకుపోయేందుకు సమావేశానికి రాకుండా తాత్సారం చేస్తోందని తెలంగాణ అధికారులు అంటున్నారు.