calender_icon.png 10 January, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పవన్ వ్యాఖ్యలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందన

05-11-2024 02:55:09 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై డీజీపీ ద్వారక తిరుమలరావు స్పందించారు. తాము రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామని డీజీపీ తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతో తాము పనిచేయలేమని స్పష్టం చేశారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసునైనా విచారిస్తామని తెలిపారు. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణే తమ విధానమని ఆయన స్పష్టం చేశారు.గత ఐదేళ్లలో నిజంగానే తప్పులు జరిగాయని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ద్వారకా తిరుమలరావు అంగీకరించారు. సోమవారం నాడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ స్పందిస్తూ.. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై తాను నేరుగా వ్యాఖ్యానించబోనని అనంతపురంలో మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో కొన్ని లోపాలు, లోటుపాట్లు జరిగాయని అంగీకరించిన ఆయన ఇప్పుడు ఆ తప్పులను సరిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, పిల్లల రక్షణతోపాటు మానవ హక్కులకు పోలీసు శాఖ ప్రాధాన్యత ఇస్తోందని డీజీపీ ఉద్ఘాటించారు. పోలీసు వ్యవస్థ మరింత బాధ్యతగా, ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించలేదని డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందని, పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించడంలో విఫలమైన సంఘటనను గుర్తు చేశారు.