హైదరాబాద్: అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) స్పందించారు. అల్లు అర్జున్ అంశం గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడమే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం, మర్యాదతో వ్యవహరించిందన్నారు. సినిమా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సాహం ఇచ్చారని కొనియాడారు. స్పెషల్ షోలు, టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అనుమతిచ్చారని చెప్పారు. ఈ విషయంలో ఏం చేయాలన్నా రెండువైపులా పదునున్న కత్తిలా సీఎం రేవంత్ పరిస్థితి మారిందన్నారు.
అల్లు అర్జున్(Allu Arjun) అనే కాదు ఎవరి విషయంలో అయినా సీఎం రేవంత్ విధానం ఒకటే అన్నారు. అల్లు అర్జున్ అంశంలో మరింతగా ముందస్తు ఏర్పాట్లు జరిగి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సిందన్నారు. సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయన్న పవన్ కళ్యాణ్ రెండో రోజే వెళ్లి మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదని పేర్కొన్నారు. ప్రతి హీరో తన సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటారని సూచించారు. అభిమానులకు అభివాదం చేయాలనే ఆలోచన ప్రతి హీరోకు ఉంటుంది.. ఈ సమస్యలో హీరోను ఒంటరి చేశారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.